ప్రభుత్వం అందిస్తున్న షాదీముబారక్, కల్యాణలక్ష్మీ సాయాన్ని కొంతమంది కాజేసే తతంగం ఆదిలాబాద్ జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. సిరికొండ, బోథ్, గుడిహత్నూర్, నేరడిగొండ, ఇచ్చోడ మండలాల్లో కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు... అక్రమాలకు పాల్పడిన వ్యవహారంపై ఈటీవీ భారత్ - ఈనాడులో కథనం రావడం... అధికారుల్లో కదలిక తీసుకొచ్చింది. ఈ అవినీతిలో.. ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయంలో షాదీముబారక్, కల్యాణలక్ష్మీ సెక్షన్ ఇన్ఛార్జిగా చేస్తున్న నదీం అనే ఉద్యోగి పాత్ర ఉన్నట్లు అధికారులు తేల్చారు. అతణ్ని కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపారు.
15 మంది పేరుతో..
బోథ్ పరిధిలోని గుడిహత్నూర్ మండలంలో తండ్రిపేరును మార్చి 15 మందికి రెండుసార్లు రూ.1,00,116 చొప్పున మొత్తం... ఇప్పించి రూ.15,01,740 కాజేసినట్లు వెల్లడైంది. బోథ్ మండలంలో తొమ్మిది మంది లబ్దిదారులపేరిట రూ.9.44 లక్షలు స్వాహా చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. సిరికొండ మండలంలో రూ.4,00,464 మేర అవినీతి జరిగినట్లు అధికారులు నిర్ధరించారు. మరోవైపు మంజూరు చేసిన డబ్బులు అందలేదని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.