తెలంగాణ

telangana

ETV Bharat / city

కడెం ప్రాజెక్టుకు మరో ముప్పు.. గేట్ల నుంచి దిగువకు తరలిపోతున్న నీళ్లు

kadem Project latest news: నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు మరో ముప్పు తలెత్తింది. సామర్ధ్యానికి మించి వచ్చిన వరదతో ఆనకట్ట భవితవ్యంపై నీలినీడలు కమ్ముకోగా... గోదావరి శాంతించడంతో గండం గట్టెక్కింది. భారీగా కొట్టుకొచ్చిన వృక్షాలు, చెత్తతో... గేట్లు మూసుకోవడం లేదు. ప్రాజెక్టులోకి వచ్చిన వరద దిగువకు వెళ్లిపోతోంది. జలాశయం డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకునే ప్రమాదం నెలకొంది. మరోవైపు.. కడెం వరద మిగిల్చిన విషాదానికి... లోతట్టు గ్రామాల్లో భీతావాహ పరిస్థితులు తలెత్తాయి. పొలాల్లో భారీగా మేటలు వేసిన ఇసుకతో... సాగు చేయలేని దుస్థితి నెలకొంది.

kadem Project
kadem Project

By

Published : Jul 15, 2022, 8:04 PM IST

కడెం ప్రాజెక్టుకు మరో ముప్పు.. గేట్ల నుంచి దిగువకు తరలిపోతున్న నీళ్లు

kadem Project latest news: రాష్ట్రంలో తొలితరం జలాశయాల్లో ఒకటైన కడెం ప్రాజెక్టు... భారీ గండం నుంచి గట్టెక్కినా మరో తీవ్ర సమస్య తలెత్తింది. గేట్లకు సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. ఇప్పుడిప్పుడే మూసే పరిస్థితే కనిపించడం లేదు. ఎడతెరిపి లేని వర్షాలతో బుధవారం రాత్రి కడెం జలాశయానికి 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. బయటకు 3 లక్షల క్యూసెక్కులు వదిలారు. 2 లక్షల క్యూసెక్కుల అదనపు ప్రవాహంతో ముప్పు ఏర్పడింది. 18 గేట్లలో 17 ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 700 అడుగుల కంటే... దాదాపు 14 అడుగుల ఎత్తు నుంచి వరద ప్రవహించి భయభ్రాంతులకు గురిచేసింది. గేట్లలో చెట్లు, కొమ్మలు ఇరుక్కొని ఆనకట్ట సహా పరీవాహక ప్రాంతమంతా గందరగోళంగా మారింది. ప్రాజెక్టులోని 18 గేట్లలో 1, 2 నెంబరు గేట్ల కౌంటర్‌ వెయిట్‌ కొట్టుకుపోగా 12వ నెంబరు గేటు తెరుచుకోనేలేదు. నాలుగో నెంబరు గేటు పగుళ్లు తేలింది. జేసీబీలు, క్రేన్‌ల సాయం లేకుండా ఇప్పటికిప్పుడు గేట్లలో చేరిన చెత్తను తొలగించే పరిస్థితి లేదు.

భారీగా చెత్త చేరడంతో... కడెం ప్రాజెక్టు గేట్లు ఇప్పటికిప్పుడే మూసివేసే పరిస్థితి కనిపించడంలేదు. మొత్తం 18 గేట్లలో జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసినవి తొమ్మిది గేట్లు కాగా..., ఇండియన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసినవి మరో 9 గేట్లు. రెండు రోజుల వరదతో భారీ వృక్షాలు ఆనకట్టపై వచ్చి చేరడంతో వాటిని తొలగించడం కష్టంగా మారింది. మరమ్మతుల అనంతరం మళ్లీ గేట్లు మూసిన తరువాత వర్షాలు కురిస్తేనే.... ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది.

కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద వల్ల... దయనీయస్థితి తలెత్తడంతో స్థానిక రైతుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కడెం సహా గోదావరి పరివాహక ప్రాంతమంతా భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. వారం నుంచి క్షణం క్షణం.... భయం భయంగా బతుకు వెళ్లదీసిన కడెం పరివాహక గ్రామాలకు ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పడ్డాయి. వేలాది ఎకరాల పంట నీటమునిగింది. సాగుకు పనికిరాకుండా పొలాల్లో ఇసుక మేటవేసిందని అన్నదాతలు వాపోతున్నారు. కడెం ప్రాజెక్టుకు దిగువన నిజాం కాలంలో నిర్మించిన వంతెనకు ఇరువైపులా... బీటీ రహదారి అడుగు భాగంలో 15 నుంచి 20 అడుగుల లోతు నుంచి మట్టి కొట్టుకుపోయింది. దీంతో నిర్మల్‌-మంచిర్యాల మధ్య రాకపోకలకు అవరోధం ఏర్పడింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details