ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వరుణుడు ఆగమాగం చేశాడు. రాష్ట్రంలోనే అత్యధికంగా కుమురం భీం జిల్లా వాంకిడిలో 36.15.సెం.మీ. వర్షం నమోదైంది. ఆసిఫాబాద్‌లో 31.48 సెం.మీ., వెంకట్రావ్‌పేటలో 19.30 సెం.మీ., నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండలంలో 16.65 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల్లో వరద ఉద్ధృతి తగ్గడం వల్ల గేట్లను మూసివేసినప్పటికీ... దిగువన ఉన్న మంచిర్యాల జిల్లా పరిధిలోని ఎల్లంపల్లి జలాశయంలోకి 8.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో పెరిగింది. 40 గేట్లు నాలుగు మీటర్ల చొప్పున ఎత్తి 875 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఎల్లంపల్లి పూర్తి స్థాయి నీటి మట్టం 20 టీఎంసీలు కాగా నిన్న 19.5 టీఎంసీలు ఉంచిన అధికారులు... ఈరోజు 16.58 టీఎంసీల వద్ద ఉంచుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో...
ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, బోథ్, ఇచ్చోడ, సిరికొండ, ఇంద్రవెల్లి మండలాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో వరద కారణంగా దాదాపుగా పదివేల ఎకరాల పంట నీటమునిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనావేసింది. బోథ్ మండలంలోని ముంపు గ్రామాలను జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర సందర్శించారు. మండలంలోని ధనోరా, నక్కలవాడ, కరత్వాడ ప్రాజెక్ట్, పోచేరా జలపాతాలను సందర్శించారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లలో అధికారయంత్రాంగం కంట్రోల్ రూంలు ఏర్పాటుచేసింది.
పనికి రాకుండా మారిన పొలాలు.. నిర్మల్ జిల్లాలో...
నిర్మల్ జిల్లాలో వర్షం జోరు కాస్తంత తగ్గుముఖం పట్టినప్పటికీ... భారీ నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 40 చెరువులకు గండిపడగా... దాదాపు 500 విద్యుత్ స్తంభాలు, మరో 50 వరకు ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయి. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖలకు సంబంధించిన వంతెనలు, రహదారులు కోతకు గురవ్వడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించారు. నిర్మల్ పట్టణంలోని జీఎన్‌ఆర్ కాలనీ, సారంగపూర్ మండలంలోని గోపాల్‌పేట్, బోరిగాం, దుర్గానగర్ తాండా, అడెల్లి, స్వర్ణ, వంజర, యాకర్‌పల్లి గ్రామాలను పరిశీలించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
ఇళ్లకు చేరేందుకు వాహనదారుల కష్టాలకు అద్దం పడుతున్న చిత్రం దీనస్థితిలో గుండేగాం ప్రజలు...
జిల్లాలోని భైంసా మండలంలో నిర్మించిన పల్సికర్ రంగారావు ప్రాజెక్ట్‌లోని బ్యాక్ వాటర్ గ్రామాల్లోకి చేరి ఇళ్లను ముంచెత్తాయి. గుండేగాం దిగువన కోతుల్‌గాం- వాడి శివారుల్లో చిన్నసుద్దవాగుపై నిర్మించిన ఈ ప్రాజెక్టులోని.. ఎగువ నుంచి భారీగా వరద రావటం వల్ల బ్యాక్‌వాటర్ గుండేగాంలోకి చేరింది. సామగ్రి, నిత్యావసరాలు తడిసి పోయాయి. మూటాముల్లె సర్ధుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం స్థానికులకు కష్టతరం కాగా.. అక్కడే ఉన్న పాఠశాలలో తలదాచుకున్నారు.
గుండేగాం బాధితుల ఆందోళన...
వరదలు వచ్చినపుడల్లా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పునరావాసం ఏర్పాటు చేసిన దగ్గర రాస్తారోకో నిర్వహించారు. న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు.
చెరువును తలపిస్తోన్న గ్రామం ఏడుపే మిగులుతోంది...
"ఒంటి మీద బట్టలతో చిన్నపిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చాం. పోలీసులు ఏది పెడితే అది తినాలి. ఇండ్లలోకి వరద నీరు వచిన్నపుడల్లా ఇట్లానే తీసుకొస్తారు. కొన్ని రోజులు స్కూల్లో ఉంచుతారు. ఆదుకుంటామని మాటలు చెప్పుతారు. నాలుగు రోజులయ్యాక ఇంటికి పంపిస్తారు. అప్పుడు వెళ్లి.. కూలిపోయి, పాడైపోయిన మా ఇళ్లను చూసుకుని ఏడవాలి. అధికారులు మాత్రం మొత్తం మర్చిపోతారు. మళ్లీ పెద్ద వానలు పడితేగానీ... మేం గుర్తుకురాం. నాలుగైదేండ్ల నుంచి ఇట్లానే ఏడుస్తున్నాం. పట్టించుకున్న వాళ్లే లేరు."- బాధితురాలు
వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న రహదారులు
మంచిర్యాల జిల్లాలో...
ఎల్లంపల్లి వరద ఉద్ధృతి కారణంగా ర్యాలీ వాగు బ్యాక్ వాటర్ ఉప్పొంగడంతో మంచిర్యాల పట్టణంలోని ఎల్‌ఐసీ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, రాంనగర్ కాలనీలు నీటమునిగి ఇళ్లలోకి వరద నీరు చేరింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ, రాంపూర్, కొల్లుర్, రాపనపల్లి గ్రామాల సమీపం గోదావరి ప్రవాహానికి నీట మునిగిన పంటలను జిల్లా పాలనాధికారి భారతి హోలీకేరి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి పరామర్శించారు. కోటపల్లి మండలంలో ప్రాణహిత నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో పంట నష్టం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. వరద వల్ల నీట మునిగిన పంటలకు సంబంధించిన బాధిత రైతుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆదుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో...
జోరు వర్షాలకు కుమురం భీం జిల్లాలో జనజీవనం స్తంభించింది. కుమురం భీం జలాశయంలోకి భారీగా వరద నీరు చేరడంతో 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పంటపొలాలు జలమయమయ్యాయి. కుమురం భీం జిల్లా పెంచికల్ పేట మండలం ఎల్కపల్లి వంతెన పనులు చేస్తున్న తొమ్మిది మంది కార్మికులు... వరదలో చిక్కుకోవడం ఆందోళనకు దారితీసింది. చివరికి స్థానికల సాయంతో పోలీసులు బాధితులను బయటకు తీయడం ప్రాణాపాయం తప్పింది. సిర్పూర్(టీ) మండలంలోని లక్ష్మీపూర్ వాగుదాటికి కొట్టుకొచ్చిన చెట్లు తగిలి... 15 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సిర్పూర్(టీ), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూరు మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దహేగాం మండంలో గిరివెల్లి ప్రధాన రహాదారి పై నుంచి ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహించడంతో 11 గ్రామాలకు... కాగజ్‌నగర్ పెంచికల్ మండలాల మధ్య బొంబాయిగూడ వద్ద పెద్దవాగు ఉప్పొంగి ప్రవహించడంతో 15 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇవీ చూడండి: