తెలంగాణ

telangana

ETV Bharat / city

అడవుల జిల్లాకు రైల్వే భరోసా ఏది? - no progress in Adilabad-Armor railway line

తెలంగాణ కశ్మీర్​గా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లాకు రైల్వే అనుసంధానంలో ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. బడ్జెట్​లో సరైన న్యాయం జరగడం లేదు. కొత్త రైళ్ల రాకపోకలకు మోక్షం లభించడంలేదు. తెల్ల బంగారంగా పేరొందిన పత్తి పంటకు, నల్లబంగారంగా ప్రసిద్ధి పొందిన సింగరేణి బొగ్గుకు పుట్టిల్లుగా పేరున్నా రైల్వే రవాణా మార్గంలో ముందడుగు పడటంలేదు.

adilabad people requesting central to allocate budget for railway
అడవుల జిల్లాకు రైల్వే భరోసా ఏది?

By

Published : Jan 31, 2021, 11:41 AM IST

రైల్వే అనుసంధానంలో ఆదిలాబాద్​ జిల్లాలో ఆశించిన అభివృద్ధి కనిపించడం లేదు. పత్తి పంట, సింగరేణి బొగ్గుకు ప్రఖ్యాతి గాంచినా.. రైల్వే రవాణా మార్గంలో ముందడుగు పడటం లేదు. నిజాం పాలనలోనే ఆదిలాబాద్‌కు మీటర్‌గేజ్‌ రైల్వే లైన్‌ ఉంది. తొలినాళ్లలో నిజాం సైన్యాలతోపాటు అవసరమైన సరకుల తరలింపునకు 1940 నుంచి మహారాష్ట్రలోని మన్మాడ్‌ వరకు రైల్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. రైల్వేలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినా ఆదిలాబాద్‌ జిల్లాకు మాత్రం ఏం ప్రయోజనం చేకూరలేదు.

సర్వేలకే పరిమితం

2006లో బ్రాడ్‌గేజ్‌లైన్‌ అందుబాటులోకి వచ్చినా.. కొత్తరైళ్లు రావడం లేదు. మంచిర్యాల మీదుగా రైళ్ల రాకపోకలు సాగుతున్నా ఆదిలాబాద్‌ - తిరుపతి మధ్య నడిచే కృష్ణతోపాటు ముంబయి-నాగపూర్ మధ్య నడిచే నందిగ్రాం ఎక్స్‌ప్రెస్‌ మినహా కొత్త రైళ్ల రాకపోకల సౌకర్యం లేదు. దక్షిణమధ్య రైల్వే చివరికి ప్రాంతంగా ఉన్నందున ఆదిలాబాద్‌ - ఆర్మూర్‌ మీదుగా హైదరాబాద్‌కు వేసే కొత్త లైన్‌, ఆదిలాబాద్‌ మహారాష్ట్రలోని గడ్‌చాందూర్‌ మధ్య వేయాలనే మరో కొత్తలైన్‌ దశాబ్ధాలుగా సర్వేలకే పరిమితమైంది. ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య వారధిగా ఉన్నా పాలకులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

పట్టించుకునే వారే లేరు..

ఆదిలాబాద్‌ పట్టణంలోని తాంసి బస్టాండ్‌ సమీపంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మంజూరై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఇటీవల ఆదిలాబాద్‌కు మంజూరైన రైల్వే పిట్‌లైన్​ను మహారాష్ట్రలోని జౌరంగాబాద్‌కు తరలించే ప్రయత్నం జరుగుతుందని సివిల్‌ సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంచిర్యాల రైల్వే ఓవర్‌ బ్రిడ్జి సమస్యదీ అదే దుస్థితి. వంతెనలు లేక... ప్రమాదాలకు దారితీస్తున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదనే ఆవేదన ప్రజల్లో గూడుకట్టుకుంటోంది.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనైనా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు రైల్వే బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించాలని, కొత్త రైళ్లతో అనుసంధానాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details