ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ 'జొమాటో' తీసుకొచ్చిన 'ఇంటర్‌సిటీ లెజెండ్స్' సేవలకు భోజన ప్రియుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఇతర నగరాల్లో పేరొందిన వంటకాలను రుచి చూసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా ఈ సేవలను ప్రయత్నించాడు. కానీ, ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ బిర్యానీ కోసం ఆర్డర్ చేస్తే.. జొమాటో కేవలం సాలన్ మాత్రమే డెలివరీ చేసింది. పైగా ఆ వ్యక్తి జొమాటో వాటాదారుడే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..
బిర్యానీ కోసం గురుగ్రామ్ నుంచి హైదరాబాద్‌కు ఆర్డర్.. షాక్ ఇచ్చిన జొమాటో - zomato intercity delivery
ఎంతో ఆశగా హైదరాబాద్‌లోని రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసిన గురుగ్రామ్ వాసికి వింత అనుభవం ఎదురైంది. బిర్యానీ లేకుండా సాలన్ మాత్రమే డెలివరీ అయింది. చివరకు జొమాటో ఏం చేసిందంటే..
గురుగ్రామ్‌కు చెందిన ప్రతీక్ కన్వాల్ ఇటీవల జొమాటో ఇంటర్‌సిటీ లెజెండ్స్ సేవలను ప్రయత్నించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్ నుంచి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే జొమాటో ఆయనకు బిర్యానీకి బదులుగా సాలన్ (బిర్యానీకి సైడ్ డిష్‌గా ఇచ్చే వంటకం) మాత్రమే డెలివరీ చేసింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన ప్రతీక్.. ట్విట్టర్ వేదికగా తన చేదు అనుభవాన్ని వివరించారు. "జొమాటో ఇంటర్‌సిటీ లెజెండ్ సర్వీస్ మంచి ఐడియా అనిపించింది. కానీ దీని వల్ల నా డిన్నర్ ప్లాన్స్ గాల్లో కలిశాయి. ఓ కస్టమర్‌గా, జొమాటో వాటాదారుడిగా ఇది నాకు రెట్టింపు నష్టమే. ఇందులో వైఫల్యం ఎక్కడుందో దీపిందర్ గోయల్ (జొమాటో సీఈఓ) వెంటనే గుర్తించాలి. కనీసం మరోసారి ఇలా జరగకుండా చూడాలి" అని ప్రతీక్ రాసుకొచ్చారు. జొమాటో, దీపిందర్ గోయల్ ట్విటర్‌కు ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేశారు.
అయితే ఈ ట్వీట్‌పై జొమాటో కస్టమర్‌కేర్ సర్వీస్ వెంటనే స్పందించింది. ప్రతీక్‌కు క్షమాపణలు చెప్పి, అదనంగా మరో బిర్యానీని కూడా అందించింది. ఈ విషయాన్ని కూడా ప్రతీక్ ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి సమస్య పరిష్కారమైందని.. కనీసం కస్టమర్ కేర్ సర్వీస్ అయినా వేగంగా స్పందించినందుకు ఓ వాటాదారుగా తాను కాస్త సంతృప్తి చెందినట్లు పేర్కొన్నారు.