Zero Depreciation Car Insurance Policy :కొత్తగా కొనుగోలు చేసిన వాహనం రోడ్డు మీదకు రావడానికి ముందే.. కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైనది వాహన బీమా. ఊహించని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా వాహనం దెబ్బతిన్నప్పుడు కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి.. ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే.. మీరు సెలక్ట్ చేసుకునే ఇన్సూరెన్స్ ప్లాన్ ఏంటి? అన్నదానిపైనే మీకు బీమా ఎంత కవర్ అవుతుందనే విషయం ఆధారపడి ఉంటుంది. అందుకే.. మీ కారు కోసం ఎలాంటి బీమా తీసుకుంటున్నారో ఓసారి చెక్ చేసుకోండి.
ఉదాహరణకు.. ఒక వ్యక్తి కారు కొనుగోలు చేశాడు. కొంత కాలం తర్వాత కారు ప్రమాదానికి గురైంది. కారు గట్టిగానే దెబ్బ తిన్నది. రిపేర్ చేయడానికి సుమారు రూ. లక్ష వరకు ఖర్చవుతుందని షో రూమ్ ప్రతినిధులు తెలిపారు. వాహనం కొనుగోలు సమయంలో ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా.. క్లెయిమ్ చేసుకుంటే సరిపోతుందిలే అని భావించాడు. బీమా సంస్థను సంప్రదించాడు. సదరు సంస్థ లెక్కలు వేసి.. అతనికి ఇన్సూరెన్స్ కింద కేవలం 50 వేల రూపాయలు మాత్రమే వస్తాయని చెప్పింది. దీంతో.. ఆ వ్యక్తి షాకయ్యాడు. అదేంటని ప్రశ్నిస్తే ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు అసలు విషయం చెప్పారు. వాహనం కొనుగోలు చేసిన రోజు నుంచి దాని తరుగును లెక్కిస్తారు. ప్రమాదం జరిగే నాటికి కారు తరుగుదల ఎంత అన్నది లెక్కించి.. క్లెయిమ్ చేసిన మొత్తం నుంచి.. డిప్రిసియేషన్ కింద రూ. 50 వేలు మైనస్ చేశారన్నమాట.
కారు సేఫ్టీ కోసం సూపర్ ఇన్సూరెన్స్ - ఈ యాడ్-ఆన్స్ కచ్చితంగా ఉండాల్సిందే!
ఇప్పుడు కారు రిపేర్కు కావాల్సిన మిగతా 50 వేలను ఆ ఓనరు సొంతంగా భరించాల్సి ఉందన్నమాట. అంటే.. ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ పూర్తిగా బీమా డబ్బులు రాలేదు. ఇలాంటి బీమాను కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటారు. కానీ.. "జీరో డిప్రిసియేషన్" బీమాను కొనుగోలు చేసిన వారికి ఈ పరిస్థితి రాదు. వాహనం తరుగుదలతో సంబంధం లేకుండా.. ఎంత నష్టం జరిగితే.. అంత మొత్తాన్నీ ఈ ప్లాన్ ద్వారా ఇన్సూరెన్స్ సంస్థలు చెల్లిస్తాయి. సో.. వాహన బీమా తీసుకునేటప్పుడు జీరో డిప్రిసియేషన్ ప్లాన్ తీసుకుంటే.. ఎలాంటి నష్టం లేకుండా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అందరికీ జీరో డిప్రిసియేషన్ ప్లాన్ ఇవ్వరు..!
- జీరో డిప్రిసియేషన్ బీమాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి.
- ఈ పాలసీ కొత్త కార్లకు, లేదా నాలుగు సంవత్సరాలలోపు కార్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- అందువల్ల కారు కొన్న ఐదు సంవత్సరాల తర్వాత ఈ పాలసీని తీసుకోవడం కొంచెం కష్టంతో కూడుకున్న పని.
- 10 ఏళ్లు దాటిన కారుకు ఈ బీమా అస్సలే ఇవ్వరు.