Yamaha two wheeler: 'ద్విచక్ర వాహనాలను ప్రయాణ సాధనాలుగానే కాకుండా.. తమ జీవన శైలికి అనుగుణంగా ఉండాలని యువత ఆకాంక్షిస్తోంది. సరికొత్త హంగులు ఉన్న వాటివై మొగ్గు చూపిస్తున్నారు. విదేశాల్లో లభ్యమవుతున్న వాహనాలు ఇక్కడా అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నారు' అని యమహా మోటార్ ఇండియా గ్రూపు ఛైర్మన్ ఐషిన్ చిహానా తెలిపారు. అందుకే యువతను ఆకట్టుకుని, మార్కెట్ వాటా పెంచుకోవడంపై దృష్టి సారించినట్లు 'ఈనాడు' ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ముఖ్యాంశాలివీ..
ద్విచక్ర వాహన మార్కెట్లో వచ్చిన మార్పులేమిటి? వాటిని ఎలా విశ్లేషిస్తారు?
ఒకప్పడు ప్రయాణానికి అనువుగా ఉండే వాహనాలపైనే ఎక్కువగా దృష్టి ఉండేది. ద్విచక్ర వాహనం తమ అభిరుచికి తగ్గట్టుగా, తమ జీవన శైలికి తోడుగా ఉండాలని నేటి యువత కోరుకుంటోంది. వాహనాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను వారు నిశితంగా గమనిస్తున్నారు. నచ్చిన మోడళ్లు దేశీయంగానూ కావాలని అడుగుతున్నారు. వాహనం తమకు కొత్త అనుభూతి కలిగించాలని వారు కోరుకుంటున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పలు మోడళ్లను అందుబాటులోకి తెస్తున్నాం.
మీ వ్యాపార వ్యూహాలు ఎలా ఉన్నాయి?
దేశంలో యమహా బ్రాండును మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. 125-155 సీసీ విభాగంలోని స్కూటర్లు, మోటార్‌సైకిళ్లను ఇందుకోసం వినియోగించుకుంటున్నాం. మా వినియోగదారులు సాంకేతికంగా ఒక అడుగు ముందే ఉండాలనేది మా అభిలాష. దీనికి తగ్గట్టుగానే వైజెడ్‌ఎఫ్-ఆర్ 15 వీ4లో క్విక్-షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్, వై-కనెక్ట్‌లాంటి అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చాం. రానున్న రోజుల్లో అన్ని మోడళ్లల్లోనూ కనెక్టెడ్ మొబిలిటీని అంందుబాటులోకి తెస్తాం.
విద్యుత్ వాహనాలపై మీ అంచనా ఏమిటి?
దేశంలో విద్యుత్ వాహనా (ఈవీ)లకు గిరాకీ పెరుగుతోంది. ఇక్కడి యమహా ఇంజినీర్లు దేశీయ అవసరాలకు సరిపోయే ఈవీని తీసుకొచ్చేందుకు యమహా మోటార్ కార్పొరేషన్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఐరోపాలో 'నియో' ఈవీకి ఎంతో ఆదరణ ఉంది. దీన్ని భారతీయ అవసరాలకు తగ్గట్టుగా డిజైన్‌తో పాటు బ్యాటరీ సామర్థ్యాలను మార్చడంపై దృష్టి పెట్టాం. దేశీయ పంపిణీదారుల నుంచి విడిభాగాలు సమీకరించి, పూర్తిగా ఇక్కడే ఉత్పత్తి చేయడం ద్వారా, అందుబాటు ధరలో దీన్ని తీసుకొచ్చే లక్ష్యంతో ఉన్నాం.
దేశీయ ద్విచక్ర వాహన విపణిలో మీ వాటా ఎంత? దీన్ని పెంచుకునేందుకు ఏం చేస్తున్నారు?
ప్రీమియం విభాగంలో మాకు 15% వాటా ఉంది. 125 సీసీ విభాగంలో 17 శాతంతో కొనసాగుతున్నాం. 2025 నాటికి మార్కెట్ వాటాను రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని విధించుకున్నాం. దీనికోసం 125, 150 సీసీ విభాగాల్లో అధునాతన సాంకేతికతతో, యువతను ఆకట్టుకునేలా కొత్త మోడళ్లు తీసుకొస్తాం. నగర, పట్టణ ప్రాంతాల్లో కొత్త వినియోగదారులను చేరుకునేందుకు, వారి వ్యక్తిగత వాహన అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాది చివరి నాటికి 100 'బ్లూ స్క్వేర్' ప్రీమియం విక్రయ కేంద్రాలను ప్రారంభించబోతున్నాం.