తెలంగాణ

telangana

ETV Bharat / business

షావోమీకి షాక్​.. CFO సహా ఇద్దరికి ఈడీ షోకాజ్​ నోటీసులు.. రూ.5వేల కోట్ల కేసులోనే! - షావోమీ ఇండియా ఈడీ కేసు

Xiaomi ED Notice : ప్రముఖ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ షావోమీకి షాక్​ తగిలింది. ఆ సంస్థకు చెందిన ముఖ్య అధికారులకు ఈడీ షోకాజ్​ నోటీసులు జారీచేసింది. వీరితో పాటు మరో మూడు బ్యాంకులకు ​కూడా షోకాజ్​ నోటీసులు జారీ అయ్యాయి.

xiaomi india enforcement directorate
xiaomi india enforcement directorate

By

Published : Jun 9, 2023, 10:18 PM IST

Xiaomi ED Notice : ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమీ టెక్నాలజీ ఇండియాపై ఈడీ కొరడా ఝులిపించింది. భారత విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెమా) నిబంధనలు ఉల్లఘించినందుకు ఆ సంస్థకు చెందిన సీఎఫ్ఓ (చీఫ్​ ఫైనాన్సియల్​ ఆఫీసర్​​) సమీర్​ రావు, మాజీ ఎండీ మను జైన్​తో పాటు సిటీ బ్యాంక్​, హెచ్​ఎస్​బీసీ బ్యాంక్​, డ్యుయిష్​ (Deutsche ) బ్యాంక్​ ఏజీకి షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈడీ (ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​) ఓ ప్రకటనలో తెలిపింది. ఫెమా చట్టం ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది.

''షావోమీ కంపెనీ గత కొన్నేళ్లుగా రూ.5551.27 కోట్ల సమానమైన విదేశీ నిధులను మూడు విదేశాల్లో పనిచేస్తోన్న సంస్థలకు అక్రమంగా పంపించింది. మాతృక సంస్థ ఆదేశాలతోనే రాయల్టీల రూపంలో ఈ భారీ మొత్తాన్ని బదిలీ చేసింది. సదరు సంస్థల నుంచి ఎలాంటి సేవలను పొందకుండానే ఈ నగదును పంపించింది. ఇది ఫెమా చట్ట నిబంధనలకు విరుద్ధం. అంతే కాకుండా, బ్యాంకులను తప్పుదోవ పట్టించి ఈ నిధులను విదేశాలకు చేరవేసింది'' అని ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

షావోమీ.. రూ. 5,551 కోట్ల సమానమైన విదేశీ నిధులను విదేశాల్లో పనిచేస్తున్న మూడు సంస్థలకు అక్రమంగా పంపించిందనే ఆరోపణలున్నాయి. షావోమీ బ్యాంకు అకౌంట్లో ఉన్న ఈ మొత్తాన్ని గతేడాది ఏప్రిల్​లో ఫెమా చట్టం 370ఏ కింద ఈడీ సీజ్​ చేసింది. వారికి అందిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ గతేడాది దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో షావోమీ రూ.5551.27 కోట్ల సమానమైన విదేశీ నిధులను.. విదేశాల్లో పనిచేస్తోన్న మూడు సంస్థలకు అక్రమంగా పంపించిందని.. మాతృక సంస్థ ఆదేశాలతోనే రాయల్టీల రూపంలో ఈ భారీ మొత్తాన్ని బదిలీ చేసిందని తేలింది.

షావోమి కంపెనీ 2014లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఆ సమయంలో షావోమి ఇండియా తొలి ఎండీగా మను కుమార్ జైన్‌ బాధ్యతలు చేపట్టారు. తర్వాత భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో కంపెనీ నిలదొక్కుకునేందుకు ఎంతో కృషి చేశారు. ఏడేళ్ల కాలంలో షావోమిని భారత్‌లో నెంబర్‌ వన్‌ బ్రాండ్‌గా నిలిపారు. 2017 నుంచి అమ్మకాల పరంగా కంపెనీ అగ్రస్థానంలో కొనసాగింది. ఈ క్రమంలో రతన్‌ టాటా షావోమిలో పెట్టుబడులు పెట్టారు. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా షావోమి స్మార్ట్‌ఫోన్లు, టీవీలను భారత్‌లో తయారు చేయడంలో మను కుమార్‌ జైన్ కీలక భూమిక పోషించారు. ఇదే సమయంలో షావోమి కంపెనీ భారత విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టాన్ని (ఫెమా) ఉల్లంఘించారన్న ఆరోపణలతో జైన్‌ ఈడీ విచారణను ఎదుర్కొన్నారు.

గత ఏడాది కాలంగా షావోమి కంపెనీలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. గతేడాది మే నెలలో కంపెనీ ఆఫ్‌లైన్‌ సేల్స్‌ డైరెక్టర్‌ సునీల్‌ బేబీ, డిసెంబరులో చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రఘు రెడ్డి, జనవరిలో కంపెనీ మార్కెటింగ్ జనరల్‌ మేనేజర్‌ సుమిత్ సునాల్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల మను కుమార్‌ సైతం తన పదవి నుంచి వైదొలిగారు.

ABOUT THE AUTHOR

...view details