కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో రెండేళ్ల పాటు భారీగా సంపదను పోగేసుకున్న ప్రపంచ బిలియనీర్లు ఇప్పుడు భిన్నమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. 2022 ఆరంభం మొదలుకొని ప్రపంచ కుబేరుల సంపద కరుగుతూ వస్తోంది. ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సంపదలో ఈ ఏడాది ఆరంభం నుంచి 62 బిలియన్ డాలర్లు తగ్గింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపదలో 63 బి.డాలర్లు కరిగిపోయింది. మెటా అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ సంపదైతే ఏకంగా సగానికి పడిపోయింది.
మొత్తంగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ జాబితాలోని తొలి 500 మంది కుబేరుల సంపద 2022 తొలి అర్ధభాగంలో 1.4 ట్రిలియన్ డాలర్ల (రూ.1.10 కోట్ల కోట్లు) సంపద ఆవిరైంది. కొవిడ్ సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు భారీ ఉద్దీపన పథకాల్ని ప్రకటించాయి. దీంతో టెక్ సంస్థలు భారీగా లాభపడ్డాయి. ఫలితంగా ఆయా సంస్థల అధిపతుల సంపద ఒక్కసారిగా పెరిగింది. తాజాగా కొవిడ్ సంక్షోభం సమసిపోతుండడంతో ఆయా దేశాలు ఉద్దీపన ఉపసంహరణలను కొనసాగిస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఆయా కంపెనీల షేర్లు కుదేలై కుబేరుల సంపద కరిగిపోతోంది. టెస్లా, అమెజాన్ షేర్లు జూన్‌తో ముగిసిన మూడు నెలల వ్యవధిలో అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి.