Mahila Samman Savings Certificate : డబ్బులు ఆదా చేసుకునేందుకు లేదా పెట్టుబడి పెట్టేందుకు అనేక మర్గాలు మనకు అందుబాటులో ఉంటాయి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అదే బ్యాంకులు, పోస్టాఫీస్‌లలో అందుబాటులో ఉండే స్కీమ్స్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల అధిక వడ్డీ రాస్తుంది. పైగా మీ డబ్బులకు భరోసా ఉంటుంది. దీనితో ఎలాంటి రిస్క్‌లేని వీటిల్లో డబ్బులు దాచుకునేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తారు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్
Mahila Samman Savings Certificate Scheme : ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్' పథకాన్ని ప్రకటించారు. మహిళల, బాలికల ఆర్థిక సాధికారితను ప్రోత్సహించడానికి ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రారంభంలో ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీసులో మాత్రమే అందుబాటులో ఉంచారు. ఇప్పుడు ఈ పథకాన్ని బ్యాంకులకు కూడా వర్తింపుజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఈ ఏడాది జూన్ 27న గెజిట్ విడుదల చేశారు. కనుక ఇకపై అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, క్వాలిఫైడ్ ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ పొదుపు పథకం అమల్లోకి రానుంది.
అమల్లోకి తెచ్చిన నాలుగు బ్యాంకులు
MSSC Scheme in Banks : ప్రస్తుతం నాలుగు బ్యాంకులు మహిళా సమ్మన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌ను మహిళలు, బాలికల కోసం అందుబాటులోకి తెచ్చాయి. మహిళల అభివృద్ధి కోసం దీనిని అమల్లోకి తెచ్చినట్లు ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించాయి. త్వరలో మిగతా బ్యాంకులు కూడా ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చే అవకాశముంది.