ఇటీవలే ఉద్యోగాలకు ఎంపికైన ఫ్రెషర్స్‌కు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ విప్రో షాక్ ఇచ్చింది. ఉద్యోగ ప్రకటనలో ఏడాదికి రూ. 6.5 లక్షల జీతంగా చెప్పిన సంస్థ.. దానిని రూ.3.5 లక్షలకు కుదించింది. ఆర్థిక మాంద్యం, డిమాండ్ లేమి కారణాలతో వేతనాన్ని తగ్గించినట్లు.. ఉద్యోగులకు మెయిల్ పెట్టింది. ఈ వేతనానికి పనిచేసే ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 20 లోపే అంగీకరించాలని పేర్కొన్నట్లు ఆలస్యంగా తెలిసింది.
విప్రో సంస్థ ఉద్యోగులను నియమించుకునేందుకు ఎలీట్, టర్బో అనే రెండు రకాల పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో ఎలీట్‌కు ఎంపికైన వారికి ఏడాదికి రూ. 3.5 లక్షలు.. టర్బోకు ఎంపికైన వారికి రూ. 6.5 లక్షలు వేతనంగా నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2022లో ఈ పరీక్షను పూర్తి చేసిన వారిని విప్రో ఉద్యోగులుగా ఎంపిక చేసింది. కాగా వారికి నియామక పత్రాలు ఇవ్వకుండా గతేడాది ఆగస్టు నుంచి వాయిదా వేస్తూ వస్తోంది. తాజాగా తక్కువ వేతనానికి అంగీకరిస్తే ఉద్యోగంలో చేరవచ్చని మెయిల్ చేసింది.
మరో 2,000 మంది ఉద్యోగులు తొలగింపు
ఆర్థిక మాంద్యం భయాలతో కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కంపెనీలకు ఉద్యోగుల తొలగింపు ప్రణాళికను అందించే ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సీ అండ్ కంపెనీ కూడా స్వయంగా తమ సిబ్బందిని తగ్గించుకునే యోచనలో ఉంది. దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు మెకిన్సీ సిద్ధం అవుతున్నట్లు ఆ కంపెనీ వర్గాలు వెల్లడించాయి.