Winter Motorcycle Riding Tips :చలికాలం వచ్చేసింది.. చల్లని గాలిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అలా సరదాగా బయటకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారు. అయితే ద్విచక్ర వాహనాలపై లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లేవారు శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు పాటించి తమ ప్రయాణాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలు మీకోసం
శీతాకాలపు డ్రైవింగ్ మెలకువలు..
చలికాలంలో వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అద్భుత సమయాన్ని అస్వాదించేందుకు చాలా మంది ద్విచక్ర వాహనాలపై లాంగ్ డ్రైవ్‌లకు వెళుతుంటారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోని పక్షంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొన్ని మెలుకువలు పాటిస్తే శీతాకాలం ద్విచక్రవాహనాలపై లాంగ్ డ్రైవ్ మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. బయటకు వెళ్లే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు, మెలుకువలు పాటించాలో ఓ సారి తెలుసుకుందామా.
టైర్లు
ద్విచక్రవాహనాలపై లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లేటప్పుడు టైర్లు ఎలా ఉన్నాయో గమనించాలి. టైరు ట్రెడ్ ఎలా ఉందో పరిశీలించాలి. శీతాకాలంలో టైర్ వేడెక్కేందుకు సమయం తీసుకుంటుంది. కనుక మెరుగైన పటుత్వం గల టైర్లు ఉన్న వాహనాలనే ఎంచుకోండి. డ్యూయల్ స్పోర్ట్స్ టైర్లను లేదా ఆఫ్ రోడ్ బయాస్డ్ టైర్లు ఉండే వాహనాలను నడుపుతున్నట్లైతే మెరుగైన ట్రాక్షన్ కోసం టైర్లను మార్చుకోవాలి. ఇదే సమయంలో మంచు, చిత్తడి నేలల్లో ప్రయాణిస్తున్నట్లైతే డ్యూయల్ స్పోర్ట్స్ టైర్‌ను వాడటమే మంచిది. కొన్ని కంపెనీలు శీతాకాలం కోసం ప్రత్యేక టైర్లను తయారు చేస్తున్నాయి. కనుక లాంగ్ డ్రైవ్‌కు వెళ్లేముందు మన వాహనాలకు ఏ టైర్ ఉంటే మంచిదో గుర్తించి అందుకు తగ్గట్లు మార్చుకుంటే మంచిది.
వేగం
ఏ ప్రయాణం అంతిమ లక్ష్యమైనా ఆనందం పొందడమే.. కానీ అది విషాదయాత్రగా మారకూడదు. అతి వేగంగా ప్రయాణించడమే ప్రమాదాలకు మూలకారణం. నియంత్రణ లేని వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాల్లో చిక్కుకోవడం ఖాయం. శీతాకాలంలో రోడ్లపై ఘర్షణ బలం తక్కువగా ఉంటుంది. దీనివల్ల వేగంగా ప్రయాణిస్తే బైక్ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. సడన్ బ్రేక్ వేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందువల్ల నెమ్మదిగా ప్రయాణించడమే ఉత్తమం.