Life insurance policy: ఒక వ్యక్తి తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు.. ఇలా కుటుంబ సభ్యులందరి అవసరాల కోసం కష్టపడి డబ్బు సంపాదిస్తారు. ఆ మొత్తంతోనే కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం ప్రణాళిక వేస్తుంటారు. అయితే, ఆ వ్యక్తి అనుకోకుండా మరణిస్తే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ అనిశ్చితిని ఎదుర్కునేందుకు.. కుంటుంబ సభ్యుల భవిష్యత్తుకు ఆర్థికంగా రక్షణ కల్పించేందుకు జీవిత బీమా తీసుకోవాలి. ముఖ్యంగా టర్మ్ బీమా. సంపాదించే వ్యక్తి, పాలసీ కాలవ్యవధిలో మరణిస్తే నామినీకి హామీ మొత్తం అందుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న టర్మ్ బీమా పాలసీని తీసుకుని కూడా పాలసీ గురించిన వివరాలు కుటుంబ సభ్యులకు తెలియజేయరు కొంతమంది. ఇది చాలా పెద్ద తప్పు.
జీవిత బీమా పాలసీ గురించి కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పాలి?
సరైన సమయానికి క్లెయిమ్ చేసేందుకు..:జీవిత బీమా ప్రాథమిక ఉద్దేశం బీమా చేసిన వ్యక్తి అనుకోకుండా మరణిస్తే.. ఆ కుటుంబ ఆర్థిక శ్రేయస్సును కాపాడగలగడం. ఒకవేళ కుటుంబ సభ్యులకు పాలసీ వివరాలు (బీమా సంస్థ, తీసుకున్న ప్లాన్, హామీ మొత్తం తదితరాలు) తెలియపర్చకపోతే.. పాలసీ గురించి పరిజ్ఞానం ఉండదు, కాబట్టి పాలసీదారుని మరణం తర్వాత అతని/ఆమె కుటుంబ సభ్యులు పాలసీని సకాలంలో క్లెయిమ్ చేయలేరు. దీంతో బీమా ప్రయోజనాలు వారికి అందవు.
తక్షణ ఖర్చులు..:సాధారణంగా ఆర్థికంగా ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు జీవిత బీమాను తీసుకుంటాం. ఆధారిత సభ్యులకు ఎటువంటి ఆదాయం ఉండదు కాబట్టి.. సంపాదించే వ్యక్తి మరణిస్తే కుటుంబ పోషణ కష్టమవుతుంది. ఒక్కోసారి మరణించిన వ్యక్తి అంత్యక్రియల ఖర్చుల కోసం కూడా నిధులు అవసరం కావచ్చు. ఇలాంటి ఖర్చులకు ఇబ్బంది పడకుండా బీమా పాలసీ, దాని ప్రొవైడర్, బ్రోకర్, క్లెయిమ్ ప్రాసెస్, క్లెయిమ్‌కు పట్టే సమయం మొదలైన వాటి గురించి లబ్ధిదారునికి లేదా విశ్వసనీయ బంధువు లేదా స్నేహితునికి వివరించాలి.
కుటుంబ దీర్ఘకాల అవసరాల గురించి చింత లేకుండా..:పాలసీ తీసుకన్న వ్యక్తి మరణిస్తే హామీ మొత్తం నామినీకి చేతికి అందుతుంది కాబట్టి నిధుల వినియోగం నామినీ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సార్లు నిధుల వినియోగం సరిగ్గా లేకపోవచ్చు, దుర్వినియోగం కావచ్చు. అలా జరగకుండా పాలసీదారుడు ఏర్పాటు చేయవచ్చు. తక్షణ అవసరాల కోసం కొంత మొత్తం వెంటనే అందిలా మిగిలిన మొత్తాన్ని నెలవారిగా 10 నుంచి 20 సంవత్సరాల పాటు అందేట్లు చేయవచ్చు. పాలసీ గురించి కుటుంబ సభ్యులకు తెలియజేయడం వల్ల హామీ మొత్తం ఏ విధంగా వినియోగించుకోవాలి.. అనే అంశంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించవచ్చు.
రుణాల గురించి ఆందోళన చెందకుండా..:వివిధ అవసరాల కోసం అప్పు తీసుకోవడం సహజం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఒక్కోసారి బంధువులు, స్నేహితుల వద్ద కూడా రుణాలు తీసుకుంటాం. ఒకవేళ అనుకోకుండా కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే..ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై పడుతుంది. ఒకవేళ జీవిత బీమా పాలసీ గురించిన సమాచారం కుటుంబ సభ్యులకు తెలియకపోతే.. రోజువారి ఖర్చులతో పాటు రుణాలు మరింత భారం అవుతాయి. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నామినీకి పాలసీ గురించి ముందుగానే సమాచారం ఇవ్వడం మంచిది.
చివరిగా..కుటుంబంలోని వ్యక్తి మరణం ఆ కుటుంబానికి తీర్చలేని లోటు. ఆ లోటును భర్తీ చేయలేము. కానీ ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా మాత్రం ముందుగానే జాగ్రత్త పడవచ్చు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి టర్మ్ పాలసీ తీసుకుంటే.. మరణ ప్రయోజనం నామినీకి అందుతుంది. పాలసీ తీసుకునే ముందు కుటుంబ అవసరాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు, రుణాలు అన్నింటిని పరిగణలోకి తీసుకుని హామీ మొత్తాన్ని లెక్కించాలి. పాలసీ గురించిన పూర్తి వివరాలు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పాటు క్లెయిమ్ ప్రాసెస్, పాలసీ అందించే ప్రయోజనాలు నామినీకి వివరించడం వల్ల సకాలంలో క్లెయిమ్ చేయగలుగుతారు.
ఇదీ చూడండి :వంటగదికి తీపి కబురు.. వంటనూనెల దిగుమతులపై సుంకాల తొలగింపు!