మీ సిబిల్ స్కోర్ తగ్గుతోందా? కారణాలు ఇవే కావచ్చు! - Common CIBIL Score Mistakes
Common Credit Score Mistakes : క్రెడిట్ స్కోర్.. క్రెడిట్ కార్డులు వాడే ప్రతి ఒక్కిరికీ సుపరిచతమైన పదం. దీని ఆధారంగానే మనకు బ్యాంకుల్లో రుణాలు లభిస్తాయి. కానీ, కొన్ని సందర్భాల్లో మనం సరైన సమయానికి లోన్స్ చెల్లించినా మనకు తెలియకుండానే క్రెడిట్ స్కోర్ తగ్గుతూ వస్తుంది. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అనే కారణాలను ఎప్పుడైనా అన్వేషించారా..?

Common CIBIL Score Mistakes :ఒక వ్యక్తి బ్యాంకుల్లో కానీ మరే ఇతర బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో కానీ రుణాలు పొందాలంటే 'క్రెడిట్ స్కోర్' అత్యంత కీలకం. సాధారణంగా 750 పాయింట్లకు మించి క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడు అది మంచి స్కోరు అని అర్థం. ఇలాంటి వారికి బ్యాంకులు సులభంగానే రుణాలు ఇస్తాయి. స్కోరు బాగున్నప్పుడు వడ్డీ రేట్లలోనూ పలు రాయితీలను కస్టమర్లకు ఆఫర్ చేస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే మన క్రెడిట్ స్కోర్లను తగ్గించేస్తాయి బ్యాంకులు. ఆయా బ్యాంకులు దీనిని ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా కొన్ని సార్లు మనం చేసే తప్పిదాలే మన క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీంతో మనం భవిష్యత్తులో మరే ఇతర రుణాలు తీసుకోవాలని అనుకున్నా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ కారణంగా మనకు కావాల్సిన అవసరాలను సకాలంలో తీర్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతుంటాము. ఇటీవలి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యే ఇది. మరి ఇంతటి కీలకమైన వ్యవహారంలో మీరు తీసుకునే కొన్ని జాగ్రత్తలతో ఈ సమస్యకు చెక్ పెట్టి మీ 'క్రెడిట్ స్కోర్'ను పెంచుకొని ఈజీగా లోన్స్ పొందొచ్చనే విషయం మీకు తెలుసా..? అదెలాగో ఇప్పుడు చూద్దాం.
- Reasons For Low CIBIL Score : ముఖ్యంగా మీ క్రెడిట్ రిపోర్ట్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే మీ క్రెడిట్ స్టేట్మెంట్లో ఏమైనా పొరపాట్లను గుర్తిస్తే వెంటనే సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
- మీరు మీ లోన్స్ ఇన్స్టాల్మెంట్లను సకాలంలోనే బ్యాంకులకు చెల్లిస్తున్నారు. కానీ, రుణదాత (లోన్స్ ఇచ్చే సంస్థలు) ఆ విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు వివరంగా నివేదించకపోవచ్చు. అలాగే ఆలస్యపు చెల్లింపులుగా పేర్కొనవచ్చు. అలాంటి సమయాల్లో మీ క్రెడిట్ స్కోర్ తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటప్పుడే అప్రమత్తమై మీరు జరిపే చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేనప్పుడు ఆ విషయాన్ని రుణదాత దృష్టికి తీసుకెళ్లండి. వెంటనే నివేదికను సవరించమని కోరండి.
- Reasons For Low Credit Score : మీ వ్యక్తిగత వివరాలుగా చెప్పే పేరు, పాన్ కార్డ్ వివరాలు, ఇంటి చిరునామా సహా తదితర అంశాల్లో ఎలాంటి తప్పులు గానీ అక్షర దోషాలు వంటి పొరపాట్లను గమనిస్తే ఆలస్యం చేయకుండా బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా మార్పించేందుకు ప్రయత్నించండి. అయితే ఈ కారణంతోనే మీ స్కోర్ తగ్గకపోయినా మీరు లోన్ తీసుకునేటప్పుడు కొన్ని సమస్యలు తలెత్తొచ్చు.
- సాధారణంగా కొందరు తమ సౌకర్యం దృష్ట్యా తాము తీసుకునే హౌస్ లోన్, వెహికిల్ లోన్ వంటి రుణాలను ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకుంటుంటారు. ఇలాంటి సమయాల్లో రెండు బ్యాంకుల్లో అప్పు ఉన్నట్లు రిపోర్ట్‌లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. అటువంటి సమయాల్లో మీ పాత రుణదాతను లేదా బ్యాంకును సంప్రదించి రుణం చెల్లించినట్లుగా క్రెడిట్ బ్యూరోలకు తెలియజేయాల్సిందిగా కోరడం ద్వారా సమస్య అక్కడిక్కక్కడే పరిష్కారమవుతుంది.
- Why CIBIL Score Is Decreased : ముఖ్యంగా కొన్నిసార్లు మీ క్రెడిట్ రిపోర్ట్‌లో మరో వ్యక్తి తీసుకున్న లోన్ వివరాలు ఉండవచ్చు. పేర్లు, చిరునామా, పాన్ సంఖ్యలో తప్పులుండటం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. మీ క్రెడిట్ నివేదికలో ఇలాంటి తప్పులను మీరు గుర్తిస్తే గనుక వెంటనే సంబంధిత బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోల దృష్టికి తీసుకెళ్లి సమాచారం ఇవ్వండి.
- Credit Score Mistake : బ్యాంకులు మనకిచ్చే క్రెడిట్ కార్డులపై రుణ పరిమితి (క్రెడిట్ లిమిట్)ని పెంచుతుంటాయి. కానీ సదరు బ్యాంకులు ఆ సమాచాం క్రెడిట్ బ్యూరోలకు ఇవ్వకపోవచ్చు. బ్యాంకులు చేసే ఈ పొరపాటు మీకు తెలియకపోవచ్చు. అయితే మీరు మీ కార్డును బ్యాంకులు పెంచిన పరిమితి మేరకు వాడినా క్రెడిట్ బ్యూరోల దగ్గర ఇందుకు సంబంధించిన సమాచారం లేకపోవడం వల్ల మీరు మీ క్రెడిట్ లిమిట్‌ను అధిగమించారన్న కారణంతో క్రెడిట్ బ్యూరోలు మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గించే ప్రమాదం ఉంది. మీ క్రెడిట్ కార్డ్ ఖాతా వివరాల్లో ఇలాంటి పొరపాట్లు కనిపిస్తే వెంటనే సదరు బ్యాంకులను సంప్రదించాలి. చెల్లింపులు సరిగ్గా నమోదయ్యాయా లేదా అనేదీ ఒకటికి రెండు సార్లు చూసుకుంటే మంచిది.
- చివరగా మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించండి. చిన్న తప్పు ఉన్నా అస్సలు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే సంబంధిత బ్యాంకు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, క్రెడిట్ బ్యూరోలకు సమాచారం అందించి వాటిని సరిచేసుకోండి. కనీసం మూడు నెలలకోసారైనా మీ క్రెడిట్ రిపోర్ట్‌ను తెప్పించుకొని పరిశీలించడాన్ని ఓ అలవాటుగా మార్చుకొండి.
- ఇవీ చదవండి:
- రూ.2వేల నోట్ల మార్పిడికి కొత్త రూల్.. ఏంటంటే?
- రూ.2వేల నోట్లు ఇప్పుడు చెల్లుతాయా? మార్చుకోవాలంటే ఛార్జీలు చెల్లించాలా?