Why Cheque Will Bounce and How to Avoid Problems : ప్రస్తుత డిజిటల్ యుగంలో.. చిన్నచిన్న చెల్లింపుల కోసం ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి UPI యాప్స్ వినియోగిస్తున్నారు. కానీ.. పెద్ద మొత్తంలో నగదును బదిలీ చేయడానికి ఇప్పటికీ చాలా మంది చెక్కుల ద్వారా చెల్లింపులను చేస్తున్నారు. అయితే.. చెక్ ఎంత విలువైనదో.. దాన్ని పూర్తి చేయడం కూడా అంతే విలువైనది. ఏ మాత్రం తేడా వచ్చినా చెక్ బౌన్స్ అవుతుంది. మరి చెక్ బౌన్స్ ఎందుకు అవుతుంది? దానికి గల కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
చెక్ బౌన్స్ అయితే ఏమవుతుంది?
చెక్ ఇష్యూ చేసిన వ్యక్తి ఖాతాలో నగదు లేకపోవడమే కాదు.. ఇంకా ఇతరత్రా కారణాలతో కూడా చెక్కులు బౌన్స్ అవుతుంటాయి. చూడ్డానికి ఇదొక సాధారణ విషయంలా కనిపించినప్పటికీ.. చెక్ బౌన్స్ అనేది క్రిమినల్ చర్య కిందకు వస్తుంది. మీపై నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద చర్యలు ఉంటాయి. నేరం రుజువైతే చట్టపరంగా శిక్షార్హులవుతారు. ఈ యాక్ట్ ప్రకారం కొన్ని సందర్భాల్లో రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు లీగల్ నోటీసులు అందుకోవాల్సి వస్తుంది. మీరు ఎవరికైనా నగదును బదిలీ చేసే క్రమంలో ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే.. జరిమానా చెల్లించాల్సి వస్తుంది. చెక్ బౌన్స్ రిపీట్ అయితే.. మీ బ్యాంకు మీ చెక్ బుక్ సౌకర్యాన్ని నిలిపివేసే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో ఏకంగా బ్యాంకు ఖాతాను కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది.
బౌన్స్ కావటానికి ప్రధాన కారణాలు..
- చెక్ బౌన్స్ కావడానికి కారణాలు చాలా ఉంటాయి.
- ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీరు ఏవరికైనా నగదును బదిలీ చేసే క్రమంలో మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉందో లేదో చూసుకోవాలి.
- మీ ఖాతాలో తగినంత నగదు లేకపోతే మీరు ఇచ్చే చెక్ బౌన్స్ అవుతుందని గుర్తుంచుకోండి.
- మీరు ఇతరులకు చెక్కులను అందించేటప్పుడు, చెక్‌పై ఉన్న నెంబర్ సరిగ్గా ఉందో లేదో చూడండి.
- చెక్‌పై నంబర్ సరిగ్గా లేకపోయినా మీ చెక్ బౌన్స్ అవుతుంది. చెక్‌పై నెంబర్ సరిగ్గా లేని వాటిని బ్యాంకు తిరస్కరిస్తుంది.
చెక్ బౌన్స్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- కొన్ని చిన్న జాగ్రత్తలను పాటించడం వల్ల మీరు చెక్ బౌన్స్ బారి నుంచి తప్పించుకోవచ్చు.
- ముఖ్యంగా మొదట గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎవరికైనా చెక్కు జారీ చేసేటప్పుడు, మీ బ్యాంకు ఖాతాలో తగిన నగదు ఉందో లేదో చూసుకోవాలి.
- మీరు బ్యాంకు ఖాతాను ప్రారంభిచేటప్పుడు ఏ విధంగా సంతకం చేశారో, మీ చెక్ బుక్‌పై సంతకం కూడా అలాగే చేయాలి.
- సంతకం తేడా ఉంటే.. మీ చెక్ ఖచ్చితంగా బౌన్స్ అవుతుందని గుర్తుంచుకోండి.
- చెక్కుపై నగదు, ఇతర వివరాలను రాసేటప్పుడు కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. తేడా ఉంటే కూడా.. చెక్ బౌన్స్ అవుతుంది.