తెలంగాణ

telangana

ETV Bharat / business

వ్యక్తిగత రుణమా.. హౌసింగ్ లోనా?.. ఏది ముందు తీర్చేయాలి?

ఆర్‌బీఐ రెపో రేటు పెంచడం వల్ల గృహరుణాల రేట్లు పెరగడం ప్రారంభించాయి. ఇప్పటికే అనేక బ్యాంకులు తమ రెపో ఆధారిత రుణాల రేట్లను సవరించాయి. దీంతో చాలామందికి రుణ వ్యవధి ఒక్కసారిగా మారిపోయింది. 20 ఏళ్లకు తీసుకున్న రుణం.. తీరేందుకు 27-28 ఏళ్లు పడుతోంది. అందుకే రుణగ్రహీతలు సాధ్యమైనంత వేగంగా ఇంటి రుణం తీర్చేందుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు ఇంటి రుణంతోపాటు, వాహన, వ్యక్తిగత రుణాలు ఉన్న వారు దేన్ని ముందు తీర్చాలనే సందేహంతో ఉన్నారు.

which loan to close first
లోన్​లు

By

Published : Dec 19, 2022, 2:30 PM IST

అధిక వడ్డీ ఉన్న రుణాన్ని ముందుగా తీర్చేయాలని నిపుణులు ఎప్పుడూ సలహా ఇస్తుంటారు. వ్యక్తిగత రుణాలపై దాదాపు 16 శాతం వడ్డీ ఉంటుంది. చెల్లించిన వడ్డీకి ఎలాంటి పన్ను మినహాయింపులూ ఉండవు. క్రెడిట్‌ కార్డుపై రుణాలు తీసుకున్నా ఇదే పరిస్థితి. అదే సమయంలో గృహరుణాలపై వడ్డీ ప్రస్తుతం 8.75-9శాతం వరకూ ఉంది.

సాధ్యమైనంత వరకూ వ్యక్తిగత, వాహన, క్రెడిట్‌ కార్డు రుణాలను తొందరగా తీర్చేందుకు అప్పుడప్పుడూ కొంత మొత్తాన్ని చెల్లిస్తూ వెళ్లడం మంచి పద్ధతి. చాలామంది బంగారంపై రుణాలూ తీసుకున్నారు. ఈ అప్పునూ వీలైనంత తొందరగా తీర్చేందుకు ప్రయత్నించాలి.

గృహరుణం దీర్ఘకాలం కొనసాగే అప్పు. ఈ క్రమంలో వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం సహజం. ఈ రుణానికి చెల్లించే వడ్డీకి రూ.2లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. అసలుకు సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1,50,000 లోబడి మినహాయింపు ఇస్తారు. వడ్డీ రేటు 7 శాతం లోపు ఉన్నప్పుడు గృహరుణాలు తీసుకున్న వారికి ఇప్పుడు ఒక్కసారిగా వ్యవధి పెరిగిపోయింది. దీన్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గితే.. ఈ వ్యవధి ఆ మేరకు తగ్గుతుంది.

పదవీ విరమణకు ఇంకా 4-5 ఏళ్లు ఉన్నవారు.. ఒకసారి గృహరుణాన్ని సమీక్షించుకోవాలి. మొత్తం తీరేందుకు ఎంత వ్యవధి ఉందో చూసుకోవాలి. దాన్ని బట్టి ఎంత మేరకు తీర్చాలో ఒక నిర్ణయానికి రావాలి. ఈ వయసులో ఉన్నవారు పన్ను అధికంగా చెల్లిస్తారు కాబట్టి, ఒకేసారి మొత్తం చెల్లిస్తే.. అధిక పన్ను భారం పడుతుంది. రుణ వ్యవధి దాదాపు దగ్గరకు వచ్చిన నేపథ్యంలో వడ్డీ పెద్దగా ఉండకపోవచ్చు. ఈ రెండు అంశాలనూ పరిగణనలో కి తీసుకున్నాకే ముందస్తు చెల్లింపు చేయాలి. కొత్తగా రుణం తీసుకున్న వారు అసలుకు కొంత మొత్తం జమ చేయడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details