వేసవి కాలం వచ్చిందటే చాలు.. ఎండలు మండిపోతాయి. ఆ గాలి వేడికి ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండలేం. దీంతో ప్రజలంతా చల్లదనం కోసం రకరకాల మార్గాలు అనుసరిస్తుంటారు. దీనిలో భాగంగా ఎక్కువ మంది ఎయిర్ కూలర్లు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతుంటారు. ఎందుకంటే ఏసీ పోల్చితే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కూలర్ల మెయింటెనెన్స్ కూడా సులభం. అందుకే చాలా మంది ఎయిర్ కూలర్లు కొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే చల్లదనాన్ని అందించే ఈ ఎయిర్ కూలర్లు కొనే ముందు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. మన అవసరాలకు తగ్గట్టుగా మాత్రమే వాటిని ఎంచుకోవాలి. మరి వాటిని ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందామా..!
వాటర్ ట్యాంక్ కెపాసిటీ
సాధారణంగా ఎయిర్ కూలర్లు నీటితో పనిచేస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కూలర్లు పనితీరు అనేది దాని నీటి ట్యాంక్ కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది. దీంతో ఎక్కువ నీటి కెపాసిటీ ఉన్న ఎయిర్ కూలర్లు కొనుగోలు చేయడం చాలా మంచిది. ఎందుకంటే వాటర్ ట్యాంక్ పెద్దగా ఉంటే కూలర్ ఎక్కువ సేపు పనిచేస్తుంది. అయితే ఇంట్లో పెద్ద గదులు ఉన్నవారు.. దాదాపు 30 నుంచి 50 లీటర్లు కెపాసిటీ ఉన్న ట్యాంకులను ఎంచుకోవాలి. అదే చిన్న రూమ్ ఉన్నవారు అయితే.. 20 నుంచి 30 లీటర్ల కెపాసిటీ ఉన్నవి తీసుకుంటే సరిపోతుంది. ఇలా పెద్ద వాటర్ ట్యాంక్ ఉన్నవి తీసుకుంటే.. ప్రతిసారి లేచి అందులో నీటిని నింపాల్సిన పని ఉండదు.
గాలి ప్రవాహం..
గది పరిమాణానికి సరిపడే ఎయిర్ కూలర్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అసలు దీని గురించి తెలుసుకునే ముందు ఇంకో విషయం తెలుసుకోవాలి. అదేంటంటే.. ఎయిర్ కూలర్ల నుంచి వీచే గాలి ప్రవాహాన్ని 'క్యూబిక్ ఫీట్ ఫర్ మినిట్(CFM)'లలో కొలుస్తారు. ప్రతి నిమిషానికి గదిలో ఎంత గాలి వీస్తుందో అన్న విషయాన్ని ఈ CFM తెలియజేస్తుంది. CFMని బట్టి ఎయిర్ కూలర్ సైజ్‌ను మనం ఎంచుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న గది పరిమాణం ఆధారంగా.. ఎక్కువ CFM ఉండే ఎయిర్ కూలర్‌ను ఎంచుకోవాలి.