Vehicle Insurance Renewal : మన దేశంలో వెహికల్ ఇన్సూరెన్స్ అనేది చట్టబద్ధమైన అంశం. వాహనం కొనుగోలు చేసే సమయంలో దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి చేస్తారు. కాలపరిమితి పూర్తయిన అనంతరం పాలసీదారులు తిరిగి పునరుద్ధరించుకోవాల్సి(రెన్యువల్) ఉంటుంది. అయితే ఈ సమయంలో పాలసీని అలాగే ఉంచుకోవాలా లేదంటే ఏమైనా సవరణలు అవసరమా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
Vehicle Insurance Details : రెన్యువల్ చేసే సమయంలో పాలసీకి సంబంధించిన మొత్తం సమాచారం సరిగ్గా, కచ్చితంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వీటిల్లో ఏవైనా మార్పులుంటే బీమా సంస్థకు తెలియజేయాలి. ఇందులో చిరునామా, ఫోన్ నంబర్, హైపోథికేషన్ హోదా సహా మరికొన్ని అంశాలు వంటివి ఉన్నాయి. ఒక్కసారి సమాచారం మొత్తం నవీకరించిన తర్వాత ప్రీమియం చెల్లించే ముందు మొత్తం వివరాలను మరోసారి చెక్ చేసుకోవాలి. వీటితో పాటు ఈ కింది విషయాలను కూడా గుర్తుపెట్టుకోండి.
పే యాజ్ యూ డ్రైవ్..
Pay As You Drive Insurance : 'పే యాజ్ యూ డ్రైవ్'(PAYD) అనేది వాహన బీమాలో వచ్చిన కొత్త పద్ధతి. మన వాహన వినియోగాన్ని బట్టి పాలసీ తీసుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. మీరు ఆడపాదడపా డ్రైవర్ అయితే, రోజూ వాహనాన్ని వినియోగించకుండా ఉంటే, డ్రైవ్ చేసిన కిలోమీటర్లతో సంబంధం లేకుండా పూర్తిగా ప్రీమియం చెల్లించే వారికి ఇదొక బెస్ట్ ఛాయిస్. ఈ ఆప్షన్ ఎంచుకుంటే మీరు క్రమం తప్పకుండా డ్రైవ్ చేయకుంటే గనుక చెల్లించే ప్రీమియం తగ్గుతుంది.
Pay As You Drive Rules : ఇందులో ప్రీమియం వివిధ మైలేజ్ శ్లాబుల ఆధారంగా లెక్కిస్తారు. ఇవి 2500 కి.మీ, 5000 కి.మీ, 7500 కి.మీ ఉంటాయి. కొన్ని బీమా కంపెనీలు మీరు డ్రైవ్ చేయని రోజుల్లో పాలసీని నిలిపివేయడానికి అనుమతిస్తాయి. ఇలాంటి సందర్భాల ఆధారంగా తదుపరి పునరుద్ధరణ సమయంలో అదనపు తగ్గింపును పొందవచ్చు. మీరు రెగ్యులర్ డ్రైవర్ కాకుంటే, ప్రీమియంపై నగదు ఆదా చేయాలనుకుంటే ఈ ఆప్షన్ ఎంచుకుంటే బెటర్.
ఆన్లైన్ ఇన్సూరెన్స్ బెస్ట్..
Online Vehicle Insurance : వెహికిల్ ఇన్సూరెన్స్ కొనుగోలు, రెన్యూవల్ విషయంలో ఆన్లైన్ చెల్లింపు విధానం ఎంచుకుంటే ఉత్తమం. ఎందుకంటే వివిధ బీమా కంపెనీలు అందించే ధరలు, ఫీచర్లను సరిపోల్చుకోవచ్చు. నగదుకు మెరుగైన విలువతో పాటు ప్రాసెస్ కూడా తొందరగా, పారదర్శకంగా జరుగుతుంది. అంతేకాకుండా.. ఆఫర్లు, డిస్కౌంట్లూ ఉంటాయి.
నో క్లెయిమ్ బోనస్..
Vehicle Insurance No Claim Bonus : పాలసీదారులు వరుసగా అయిదేళ్ల పాటు (గరిష్ఠంగా) ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే అలాంటి వారు 'నో క్లెయిమ్ బోనస్'(NCB)ను పొందవచ్చు. ఇందులో డిస్కౌంట్ శాతం మొదటి సంవత్సరంలో 20 శాతం, అయిదో సంవత్సరంలో 50 శాతం వరకు ఉంటుంది. అయితే ఈ సమయంలో ఒక్కసారి క్లెయిమ్ చేసుకున్నా.. ఆ బోనస్ వర్తించదు. అంతేకాకుండా పాలసీదారులు NCBను మరొక లేదా కొత్త కారుకి బదిలీ చేసుకోవచ్చు.
యాడ్ ఆన్స్..
Add Ons In Motor Insurance : కారు బీమా పాలసీని సమగ్రంగా పునరుద్ధరించేటప్పుడు అందుబాటులో ఉన్న యాడ్ ఆన్(Ad On's)లను జాగ్రత్తగా పరిశీలించండి. ఇవి జీరో తరుగుదల కవర్, ఇంజిన్ రక్షణ కవర్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవర్, లాక్ అండ్ కీ కవర్లు వంటి బీమా ప్లాన్లు ఉంటాయి. ఇవి మన ఆర్థిక సామర్థ్య ఖర్చులను తగ్గించడమే కాకుండా వాటి నుంచి రక్షిస్తాయి.
గడువు కంటే ముందే చేసుకోండి..
What Are NCB Benefits In Insurance : కారు ఇన్సూరెన్స్ పాలసీని నిర్ణీత గడువు (ఎక్స్పైరీ డేట్) కంటే 15-30 రోజుల ముందే రెన్యూవల్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నిరంతరాయ కవరేజీ అందడంతో వాహనానికి పూర్తి రక్షణ ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా రెన్యూవల్ చేయించడం మర్చిపోతే పాలసీని కోల్పోవడమే కాకుండా ఎలాంటి క్లెయిమ్ పొందలేరు. గడువు ముగిసిన తర్వాత కూడా పాలసీని పునరుద్ధరించుకోవచ్చు. కానీ ఆ సమయంలో వాహనాన్ని తనిఖీ చేసే అవకాశాలుండవని చెప్పలేము. చేస్తే గనుక రిస్కే. అయితే బీమా గడువు ముగిసిన 90 రోజుల్లోపు పాలసీని రెన్యూవల్ చేస్తే NCB ప్రయోజనాల్నీ పొందవచ్చు. లేని పక్షంలో ఆ బెనిఫిట్స్ రాకపోగా.. ఇన్సూరెన్స్ రద్దయ్యే అవకాశముంది.