తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా వాట్సాప్​ డేటా లీక్.. అమ్మకానికి 50 కోట్ల యూజర్ల నంబర్లు.. సంచలన నివేదిక! - 50 crore whatsup users data hacked

వాట్సాప్‌ యూజర్లకు హెచ్చరిక. ఈ మెసేజింగ్‌ యాప్‌ నుంచి భారీగా డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు 50కోట్ల మంది యూజర్ల ఫోన్‌ నంబర్లు హ్యాకర్ల చేతికి వెళ్లినట్లు సమాచారం. ఇందులో భారత యూజర్ల నంబర్లు సైతం ఉన్నాయట.

వాట్సాప్‌ డేటా లీక్‌
whatsapp data leaked

By

Published : Nov 27, 2022, 8:29 AM IST

Updated : Nov 27, 2022, 8:49 AM IST

Whatsapp Data Leak: ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ నుంచి భారీగా డేటా లీక్‌ అయ్యింది. దాదాపు 50కోట్ల మంది వాట్సాప్‌ యూజర్ల ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు తాజాగా సైబర్‌న్యూస్‌ నివేదిక వెల్లడించింది. అమెరికా సహా పలు దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను హ్యాకర్లు అమ్మకానికి ఉంచినట్లు తెలిసింది.

ఓ హ్యాకింగ్‌ కమ్యూనిటీ ఫోరమ్‌లో ఈ ఫోన్‌ నంబర్ల విక్రయానికి సంబంధించిన ప్రకటన పెట్టినట్లు సైబర్‌న్యూస్‌ కథనం పేర్కొంది. 48.7కోట్ల వాట్సాప్‌ యూజర్ల ఫోన్‌ నంబర్లతో 2022 డేటాబేస్‌ను విక్రయిస్తున్నట్లు ఓ హ్యాకర్‌ ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చాడు. అమెరికా, యూకే, ఈజిప్టు, ఇటలీ, సౌదీఅరేబియా సహా 84 దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను అమ్మకానికి పెట్టారని ఆ కథనం వెల్లడించింది. ఇందులో భారత యూజర్ల నంబర్లు కూడా ఉన్నాయట.

అత్యధికంగా ఈజిప్టు నుంచి 4.5కోట్ల మంది, ఇటలీ నుంచి 3.5 కోట్ల మంది, అమెరికాకు చెందిన 3.2 కోట్ల మంది, సౌదీ అరేబియా నుంచి 2.9కోట్లు, ఫ్రాన్స్‌ నుంచి 2 కోట్లు, టర్కీకి చెందిన 2 కోట్లు, యూకే నుంచి 1.1కోట్లు, రష్యా నుంచి దాదాపు కోటి మంది వాట్సాప్‌ యూజర్ల నంబర్లు లీకైనట్లు సైబర్‌న్యూస్‌ కథనం తెలిపింది. ఒక్కో దేశానికి చెందిన యూజర్ల నంబరుకు ఒక్కో ధరతో విక్రయానికి పెట్టారని పేర్కొంది. అమెరికా డేటాసెట్‌ అయితే 7వేల డాలర్లు, యూకే డేటా ధర 2500 డాలర్లు, జర్మనీ యూజర్ల నంబర్ల ధర 2వేల డాలర్లుగా ఉన్నట్లు వెల్లడించింది.

ఈ నంబర్లను సైబర్‌ నేరగాళ్లు కొనుగోలు చేసుకుని మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. అందువల్ల, గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్‌, మెసేజ్‌లు వస్తే స్పందించొద్దని సూచించింది. కాగా.. మెటాకు చెందిన సంస్థల్లో డేటా లీక్‌ ఘటనలు ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా 50కోట్ల మందికి పైగా ఫేస్‌బుక్‌ యూజర్ల డేటా హ్యాకర్ల చేతికి చిక్కి ఆన్‌లైన్‌లో లీక్‌ అయినట్లు వార్తలు వచ్చాయి.

Last Updated : Nov 27, 2022, 8:49 AM IST

ABOUT THE AUTHOR

...view details