తెలంగాణ

telangana

ETV Bharat / business

కొత్త ఏడాదికి 'ఆర్థిక' స్వాగతం.. భవిష్యత్తులో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే! - precautions should be taken in personal

నూతన సంవత్సర ఉషోదయం సమీపిస్తోంది. మంచి, చెడు జ్ఞాపకాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. కొత్తదనానికి స్వాగతం పలికేందుకు మనందరమూ సిద్ధం అవుతున్నాం. ఇప్పటి వరకూ ఏం చేశాం? మున్ముందు ఏం చేయాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఎటు చూసినా.. సమాధానం మాత్రం డబ్బు అనే వస్తుంది. ఇప్పటికే మన దగ్గర ఉన్న సొమ్మును సరిగ్గా నిర్వహించాలి. భవిష్యత్‌ అవసరాలనూ దృష్టిలో పెట్టుకోవాలి. 2023లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒకసారి తెలుసుకుందాం.

what precautions should be taken in personal financial matters in the context of entering 2023.
what precautions should be taken in personal financial matters in the context of entering 2023.

By

Published : Dec 31, 2022, 12:54 PM IST

రెండేళ్లుగా ఆర్థికంగా ఎన్నో సవాళ్లు చూశాం. వాటిని సమర్థంగా ఎదుర్కొంటూ 2023లోకి అడుగుపెట్టబోతున్నాం. కరోనా భయాలు ఒకవైపు, ఆర్థిక మాంద్యం ఛాయలు మరోవైపు ఈసారీ ఇబ్బందులు పెట్టే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఆందోళన చెందకుండా సరైన ప్రణాళికతో సిద్ధం కావాల్సిన తరుణమిది.

10 శాతం పొదుపు చేయండి..
అమెరికన్‌ మనస్తత్వవేత్త అబ్రహం మాస్లో.. మానవ అవసరాలను ఒక పిరమిడ్‌గా చూపారు. అత్యంత ప్రాథమిక అవసరాలు.. ఆహారం, దుస్తులు, నివాసం ముందుగా సాధించాలి. అప్పుడే మనం ఇతర లక్ష్యాల గురించి ఆలోచించగలం. మీ పొదుపును సరిగ్గా నిర్వహించడం అనేది ఆర్థిక ప్రశాంతతకు తొలి మెట్టు. చాలామంది దీన్ని సాధించేందుకే పోరాడుతుంటారు. పొదుపు విషయంలో క్రమశిక్షణతో ఉండాలి. అప్పుడే మిగతావన్నీ అనుసరిస్తాయి. కొత్త ఏడాదిలో ఆర్థిక స్వేచ్ఛను పొందాలంటే తొలుత పొదుపు అవసరాన్ని గుర్తించండి. మీరు ఇంటికి తీసుకెళ్లే వేతనంలో కనీసం 10 శాతం పొదుపు చేయండి. వీలైతే 20 శాతం పక్కన పెట్టండి. అత్యవసర పరిస్థితుల కోసం మీ నెలవారీ ఆదాయానికి మూడు నుంచి ఆరు రెట్లు ఎఫ్‌డీలో జమ చేయండి. తప్పనిసరిగా పొదుపు చేసేందుకు రికరింగ్‌ డిపాజిట్‌ను ఉపయోగించండి. క్రమం తప్పకుండా బడ్జెట్‌ వేసుకోండి. మీ ఆదాయం, ఖర్చులన్నింటికీ లెక్కలుండేలా చూసుకోండి. పొదుపును పెంచేందుకు ఖర్చులను తగ్గించుకోవాలనే మూల సూత్రం మర్చిపోవద్దు. వడ్డీ రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. కానీ, గత సంక్షోభాలను మర్చిపోవద్దు. మంచి నిర్వహణ, తక్కువ ఎన్‌పీఏలు ఉన్న బ్యాంకులో మీ డబ్బును డిపాజిట్‌ చేయండి.

సురక్షితంగా ఉండండి..
ఆరోగ్య బీమా ఉందా అని వంద మందిని ప్రశిస్తే ఒకరిద్దరు మాత్రమే ఉంది అనే సమాధానం చెప్తారు. ఇప్పటికే మనం కరోనా మిగిల్చిన ఆర్థిక భారాన్ని చూశాం. మళ్లీ పలు దేశాల్లో కొత్త వేరియెంట్లు కలవరపెడుతున్నాయి. భారత్‌లో ఈ మహమ్మారి మళ్లీ విస్తరించకూడదనే కోరుకుందాం. కానీ, మన సన్నద్ధత విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. 2023లో ముందుగా మీరు చేయాల్సిన పని జీవిత, ఆరోగ్య బీమా పాలసీలను తీసుకోవడమే. ఇప్పటికే ఉంటే అవి మనకు సరిపోయేంత మేరకు ఉన్నాయా లేదా చూసుకోవాలి. మీ కుటుంబానికి సరైన ఆర్థిక రక్షణ కల్పించాలంటే.. మీ వార్షికాదాయానికి కనీసం 10 రెట్లు టర్మ్‌ ఇన్సూరెన్స్‌, రూ.10లక్షల ఆరోగ్య బీమా పాలసీ తప్పనిసరిగా తీసుకోండి.

అప్పులు వద్దు..
సాధ్యమైనంత వరకూ మీ సొంత డబ్బును ఖర్చు చేసేందుకే ప్రయత్నించండి. 2022లో రిటైల్‌ రుణాలు బాగా పెరిగాయి. ఎంతోమంది వ్యక్తిగత రుణాలను తీసుకున్నారు. క్రెడిట్‌ కార్డులు, ఇప్పుడు కొనండి-తర్వాత చెల్లించండి (బీఎన్‌పీఎల్‌), బంగారంపై అప్పు ఇలా అనేక మార్గాల్లో రుణం తీసుకున్న వారి సంఖ్య అధికంగా ఉంది. వడ్డీ రేట్లు పెరుగుతున్నా గిరాకీపై ప్రభావం చూపలేదు. ఆకాంక్షలను నెరవేర్చుకోవాలనుకుంటే కొన్నిసార్లు అప్పు తప్పకపోవచ్చు. అవసరమైన మేరకే రుణం తీసుకోండి. ఎప్పటికప్పుడు దాన్ని తిరిగి చెల్లించేలా చూసుకోండి. మీ క్రెడిట్‌ కార్డు వినియోగం పరిమితిలో 30 శాతం దాటనీయొద్దు. నెలకోసారి క్రెడిట్‌ స్కోరును తనిఖీ చేసుకోండి. మీ స్కోరు 750కి తక్కువగా ఉండే వాయిదాలు, క్రెడిట్‌ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడంలాంటివి పాటించండి. తిరిగి స్కోరును పెంచుకునేందుకు ప్రయత్నించండి.

అప్రమత్తంగా..
మహమ్మారిలాంటివి ఆర్థికంగా ఇబ్బందులు పెడుతుంటే.. డిజిటల్‌, సైబర్‌ నేరాలు మరింత కలవరపెడుతున్నాయి. 2023లో ఇవి మరింత పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే నివేదికలు చెబుతున్నాయి. యూపీఐ, క్రెడిట్‌ కార్డులు, నెట్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలను సురక్షితంగా చేయండి. మీ వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దు. మీ పెట్టుబడులన్నింటికీ నామినీ ఉండేలా చూసుకోండి. పదవీ విరమణ నిధిపై ప్రత్యేక శ్రద్ధ చూపించండి.

విశ్వాసనీయంగా..
మీ చుట్టూ ఒకసారి పరిశీలించండి. త్వరితగతిన డబ్బు రెట్టింపు అయ్యేలా ఎన్నో పథకాలున్నాయనే ప్రచారాలు ఎన్నో కనిపిస్తాయి. పెట్టుబడి సలహాలకు కొదవ లేదు. ఇందులో ఏది వాస్తవం, ఏది మనల్ని ముంచేస్తుంది అనేది తెలుసుకోవాలి. క్రిప్టో కరెన్సీ ఇప్పుడు చట్ట విరుద్ధం. ఎంతోమంది స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ చేస్తూ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో నష్టాలు మూటగట్టుకుంటున్నారు. మీ ఆర్థిక పరస్థితి బలోపేతం కావాలంటే తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాలి. అదీ విశ్వసనీయ మార్గాల్లోనే. ఉదాహరణకు నిఫ్టీ 50, సెన్సెక్స్‌లాంటి సూచీ ఫండ్లలో మదుపు చేసినా దీర్ఘకాలంలో సంపదను సృష్టించవచ్చు. మీ జీవిత లక్ష్యాలు, పెట్టుబడి ప్రణాళికలు, నష్టాన్ని భరించే సామర్థ్యం, పెట్టుబడిని కొనసాగించే వ్యవధి ఇలా అన్ని అంశాలను పరిశీలించాకే నిర్ణయం తీసుకోండి. 2023లో స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటిని సాధించేందుకు సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోండి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే. మీ కుటుంబం ఆర్థికంగా ఎలా ఉండాలి.. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతే చాలు.
-- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

మదుపు.. ఆపొద్దు
మార్కెట్‌లో ఎన్ని హెచ్చుతగ్గులు వచ్చినా అవన్నీ పెట్టుబడిదారుడికి సానుకూలమేనని నమ్మండి. స్టాక్‌ మార్కెట్‌లో సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. అన్ని మార్కెట్‌ పరిస్థితుల్లోనూ అందులో ఉండేలా క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ఎంచుకోండి. చిన్న మొత్తమైనా కాలక్రమేణా వృద్ధి చెందేందుకు ఇది తోడ్పడుతుంది. పథకాల ఎంపికలో వైవిధ్యం ఉండేలా జాగ్రత్త తీసుకోండి. తక్కువ వ్యయ నిష్పత్తి ఉండే పాసివ్‌ ఇండెక్స్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్ఛేంజీలలో మదుపు చేసేందుకు ప్రయత్నించండి. పెట్టుబడిదారులు టెక్నాలజీ, హెల్త్‌కేర్‌, గ్రీన్‌ ఎకానమీ, క్లీన్‌ ఎనర్జీ, ఫ్యూచర్‌ మొబిలిటీ లాంటి కొత్తతరం రంగాలను పరిశీలించాలి. తమ లక్ష్యాలకు అనుగుణంగా మ్యూచువల్‌ ఫండ్లు అందించే పథకాలను ఎంచుకోవచ్చు. సురక్షితంగా మదుపు చేయాలనుకునే వారికీ డెట్‌ ఫండ్లూ మంచి ఎంపికే.
-- రాఘవ అయ్యంగార్‌, చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌, యాక్సిస్‌ ఏఎంసీ

మన కోసం కష్టపడేలా..
డబ్బును సంపాదించేందుకు కష్టపడతాం. అదే సమయంలో మనకు ఉపయోగపడేలా డబ్బునూ కష్టపెట్టాలి. కొత్త ఏడాది వచ్చినప్పుడే కాదు.. పెట్టుబడులు నిరంతరం ఆగకుండా కొనసాగాల్సిందే. పెట్టుబడిదారులు తమ అవసరాలకు అనుగుణంగా బ్యాలెన్స్‌డ్‌, హైబ్రిడ్‌ ఫండుల లేదా స్థిరాదాయం అందించే ఫండ్లను ఎంచుకోవచ్చు. వడ్డీ రేట్ల తగ్గింపు నుంచి రక్షణ పొందేందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో డెట్‌ ఫండ్లనూ పరిశీలించాలి. పదవీ విరమణ ఒక తప్పనిసరి లక్ష్యం కావాలి. ఖర్చు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంలో వ్యూహాత్మకంగా అడుగు వేయాలి. చిట్కాల ఆధారంగా పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి. బీమాను పెట్టుబడిని కలపకూడదు. ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా పెట్టుబడులు ఉండాలన్న విషయాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు.
-- శ్రీనివాస్‌ రావు రావూరి, చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌, పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details