What Is Top Up Health Insurance Policy :ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కుటుంబంలో ఒక్కరు అనారోగ్యం పాలైనా.. ఆర్థిక లక్ష్యాలన్నీ తారుమారైపోతున్నాయి. ఈ తరుణంలోనే ఆరోగ్య బీమా తప్పనిసరి అవసరంగా మారింది. ఇది వైద్య అవసరాలకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. చాలామంది ఒకటే పాలసీ తీసుకొని, తమకు తగినంత రక్షణ ఉందని భావిస్తుంటారు. మరోవైపు అధిక ప్రీమియాలూ పాలసీదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయాల్లోనే ప్రాథమిక ఆరోగ్య బీమాకు టాపప్ చేయించుకోవడం మంచిది.
ఉదాహరణకు.. సంజయ్ అనే వ్యక్తి.. కుటుంబం మొత్తానికీ వర్తించేలా 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పాలసీని తీసుకున్నారు. ఇది తన కుటుంబ ఆరోగ్య బీమాకు సరిపోతుందనే నమ్మకంతోనే ఉన్నారు. సంజయ్ అనుకోకుండా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. చికిత్స కోసం 9 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యింది. రూ.5లక్షలు ఆరోగ్య బీమా చెల్లించగా.. మిగతా నాలుగు లక్షల రూపాయలు జేబు నుంచి చెల్లించాల్సి వచ్చింది. పిల్లల ఉన్నత చదువుల కోసం దాచిన సొమ్మునంతా అతడి ఆస్పత్రి ఖర్చుల కోసం ఉపయోగించారు.
ముందుగానే ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎవరూ ఊహించలేరు. ఖర్చు ఎంతవుతుందన్నదీ అంచనా వేయలేరు. కాబట్టి, వీలైనంత అధిక మొత్తానికి సెక్యూరిటీ ఉండటమే ఎప్పుడూ దీనికి పరిష్కారం. అలా అని పెద్ద మొత్తంలో బీమా పాలసీ తీసుకుంటే ప్రీమియం భారంగా మారే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలోనే టాపప్ ప్లాన్‌లు అవసరం అవుతాయి.
ఏమిటి టాపప్ ప్లాన్లు?
ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీకి అదనంగా కొనుగోలు చేసేందుకు వీలున్న ఒక అనుబంధ పాలసీలను టాపప్ ప్లాన్లుగా చెప్పొచ్చు. ప్రాథమిక పాలసీ ఖర్చయిన తర్వాతే.. ఈ టాపప్ పాలసీలు మిగిలిన మొత్తాన్ని భరిస్తాయి.
ఉదాహరణకు సంజయ్‌నే తీసుకుంటే.. అతడికి రూ.5లక్షల ప్రాథమిక పాలసీ.. మరో రూ.5 లక్షల టాపప్ పాలసీ ఉందనుకుందాం. మొదటగా ప్రాథమిక పాలసీ రూ.5లక్షలు ఆసుపత్రి బిల్లు చెల్లిస్తుంది. ఆ తర్వాత మిగిలిన నాలుగు లక్షల రూపాయలను టాపప్ పాలసీ ఇస్తుంది. టాపప్ తీసుకునే సమయంలోనే.. ఎంత మొత్తం తర్వాత వర్తించాలన్నది ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలతో పోలిస్తే టాపప్‌లకు తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకే సంస్థ నుంచి ఆరోగ్య బీమా పాలసీని, దాంతోపాటు టాపప్ పాలసీని తీసుకోవచ్చు. లేదా రెండు పాలసీల కోసం వేర్వేరు బీమా సంస్థలనూ ఎంపిక చేసుకోవచ్చు.