What is FD Laddering and How Can We Maximize Returns From Fixed Deposits :కష్టపడి సంపాదించిన డబ్బులను రిస్క్ లేని పెట్టుబడి మార్గంలో పెట్టాలని చాలా మంది ఆశపడతారు. అలాంటి వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు బాగా పాపులర్ అయ్యాయి. స్థిరమైన రాబడి వస్తుందన్న నమ్మకంతో వినియోగదారులు వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రోజుల్లో బ్యాంకులు కూడా అనేక రకాల ఫీచర్లు, మంచి వడ్డీ రేట్లు అమలు చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
అయితే.. ఒకసారి ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన మొత్తం మెచ్యూరిటీ పీరియడ్ అయ్యే వరకూ లాక్ అయి ఉంటుంది. మధ్యలో ఏదైనా అత్యవసరం అయ్యి డబ్బు కావాల్సి వస్తే.. తీసుకోడానికి వీలు ఉండదు. కొన్ని బ్యాంకులు ప్రీ మెచ్యూర్ విత్ డ్రాకు అనుమతించినా.. ఫైన్లు విధిస్తాయి. అయితే.. మీరు ఓ స్ట్రాటజీ ద్వారా ఇటువంటి అత్యవసర పరిస్థితులను అధిగమించడంతోపాటు అనేక ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. అదే ఎఫ్‌డీ ల్యాడరింగ్(FD Laddering). అసలు ఎఫ్‌డీ ల్యాడరింగ్ అంటే ఏమిటి? దానిని ఎలా ఉపయోగించాలి..? లాంటి వివరాలను ఇక్కడ చూద్దాం.
SBI Wecare Special Fixed Deposit Scheme: ఎస్బీఐ నుంచి సూపర్ స్కీం.. కొద్దిరోజులే ఛాన్స్!
ఎఫ్‌డీ ల్యాడరింగ్ అంటే ఏమిటి?
What if FD Laddering..?: మీ దగ్గర ఉన్న డబ్బులను ఒకే ఎఫ్‌డీ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టకుండావివిధ టెన్యూర్లలో చిన్న చిన్న మొత్తాలుగా విభజించి ఇన్వెస్ట్ చేయడాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ ల్యాడరింగ్ అంటారు. ఇది లిక్విడిటీ అవసరాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడుతుంది. వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్న సమయంలో మంచి లాభాలను అందుకునే అవకాశం కల్పిస్తుంది.
ఉదాహరణకు మీరు 1 లక్ష రూపాయలను.. 5 ఏళ్ల ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారనుకోండి. దీనికి బదులుగా మీరు 5 వేర్వేరు ఎఫ్‌డీ ఖాతాలను ఓపెన్ చేయాలి. 1 లక్ష రూపాయలను 5 భాగాలుగా విభజించి.. ఒక్కొక్క దానిలో 20వేల రూపాయల చొప్పు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి. 5 అకౌంట్ల మెచ్యూరిటీ పీరియడ్ వరుసగా.. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు, ఐదేళ్లు ఉండేలా చూసుకోవచ్చు. బ్యాంక్ అందించే వడ్డీ రేట్ల ప్రకారం టెన్యూర్ ఉండాలి.
తక్కువ వడ్డీకి తక్కువ టెన్యూర్, ఎక్కువ వడ్డీకి ఎక్కువ కాలం మెచ్యూరిటీ పీరియడ్ ఉండేలా చూసుకోవాలి. టెన్యూర్, వడ్డీ ప్రకారం పెట్టుబడి పెట్టాలి. ఇలా మీ పెట్టుబడిని విభజించి వేరు వేరు టెన్యూర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా వివిధ సమయాల్లో మెచ్యూరిటీ సొమ్ము మీ చేతికి వస్తుంది. అవసరాలకు తగిన డబ్బు తీసుకుని మిగిలిన దాన్ని మళ్లీ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు. ఎఫ్‌డీ ల్యాడర్ ని ఎంపిక చేసుకున్న తర్వాత వడ్డీల పెరుగుదల, తగ్గుదల గురించి చింతించాల్సిన అవసరం లేదు.