'ఎవరైనా షేర్లలో పెట్టుబడి ఎందుకు పెడతారు.. ధర పెరుగుతుంది, లాభాలు వస్తాయనే కదా? కానీ షేర్ల ధరలు పెరగడమే కాదు, పడిపోతాయి కూడా.. ఆ విషయాన్ని మదుపర్లు గుర్తుపెట్టుకోవాలి' అంటున్నారు అమెరికాకు చెందిన సుప్రసిద్ధ పెట్టుబడిదారు వారెన్ బఫెట్. ఎక్కువకాలం వేచి చూడలేని వారు షేర్లు కొనద్దని ఆయన సూచిస్తున్నారు. దీర్ఘకాలం పాటు ఎదురుచూడగలిగితేనే షేర్లు కొనుగోలు చేయాలని 'వారెన్ బఫెట్ వీడియోస్' పేరుతో విడుదలైన ఒక వీడియోలో ఆయన ఉద్బోధించారు.
'ఒక్కోసారి కొనుగోలు చేసిన కంపెనీ షేరు ధర, 50 శాతం వరకు పడిపోవచ్చు' అని హెచ్చరిస్తున్నారాయన. బెర్క్‌షైర్ చరిత్రలో ఇలా మూడు సార్లు జరిగినట్లు తెలిపారు. 'తప్పులేం జరగలేదు.. అయినా బెర్క్‌షైర్ షేరు ధర గణనీయంగా పడిపోయింది.' అని వివరించారు. మదుపరులకు మానసిక స్థిరత్వం అవసరమని, లేని పక్షంలో 'షేర్లు కొనుగోలు చేయాల్సిన సమయంలో విక్రయించడం, లేదా విక్రయించాల్సిన సమయంలో కొనుగోలు చేయడం జరుగుతుంద'ని విశదీకరించారు. షేరు ధరల హెచ్చుతగ్గులకు, ఇతర అభిప్రాయాలకు ప్రభావితం కావద్దని అన్నారు.
స్థిరాస్తి కొన్నట్లే
ఒక స్థలం కొనడానికి మనం ఎలా సన్నద్ధులం అవుతామో, షేర్లు కొనుగోలు చేయడానికీ అదేవిధంగా సిద్ధం కావాలని వారెన్ బఫెట్ వివరించారు. స్థలాలపై పెట్టుబడి పెట్టిన వారు దీర్ఘకాలం పాటు ఎదురుచూడడానికి సన్నద్ధమవుతారని, ఈ తరహాలోనే షేర్లపై పెట్టుబడులను కూడా దీర్ఘకాలం పాటు కొనసాగించాలని ఆయన సూచించారు. 'స్వల్ప కాలంలో ధరలు పెరుగుతాయనే ఆలోచనతో షేర్లు కొనొద్దు.. అటువంటి ఆలోచనే సరికాదు' అన్నారాయన.