Virtual Credit Card Benefits : క్రెడిట్ కార్డుల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి భౌతికమైనవి కాగా.. రెండోవి వర్చువల్ క్రెడిట్ కార్డులు. పేరుకు తగ్గట్లే, వీటిని భౌతికంగా ఉపయోగించలేం. కానీ రియాలిటీలో ఉపయోగించవచ్చు. ఈ వర్చువల్క్రెడిట్ కార్డ్‌లు అనేవి భౌతిక క్రెడిట్ కార్డులకు డిజిటల్ వెర్షన్‌లు. భౌతిక క్రెడిట్ కార్డులలాగే వర్చువల్ క్రెడిట్ కార్డుకు సైతం ప్రత్యేక నంబరు, వ్యాలిడిటీ, ఎక్స్పైరీ డేట్, సీవీవీ నంబరు ఉంటాయి. ఈ వర్చువల్ క్రెడిట్ కార్డుతో స్వైపింగ్ చేయలేము. కనుక ఆన్‌లైన్ ఫ్రాడ్స్ జరిగే అవకాశాలు తక్కువ. అయితే వీటికున్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, వీటిని ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం ఉపయోగించలేం. పైగా తక్కువ వ్యాలిడిటీ పీరియడ్ ఉండటం మరో ప్రతికూలాంశం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మీకు భౌతికమైన క్రెడిట్ కార్డు ఉన్నప్పుడు మాత్రమే వర్చువల్ కార్డును ఉపయోగించగలరు. మంచి విషయం ఏమిటంటే, మీ వర్చువల్ కార్డుపై ఖర్చుల పరిమితి (స్పెండింగ్ లిమిట్)ని విధించుకోవచ్చు.
వర్చువల్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు
Benefits Of Virtual Credit Cards :ఇప్పుడు ఈ వర్చువల్క్రెడిట్ కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
- సాధారణ క్రెడిట్ కార్డుల్లాగా వీటిని ప్రతిసారీ మన వెంట తీసుకెళ్లాల్సిన పనిలేదు.
- వర్చువల్ క్రెడిట్ కార్డు సమాచారాన్ని మీ ఫోన్లో స్టోర్ చేసుకోవచ్చు.
- కార్డు దుర్వినియోగం అయ్యే అవకాశం తక్కువ.
- కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత, అది వచ్చే వరకు వేచి చూడాల్సిన పనిలేదు. తక్షణమే ఉపయోగించుకోవచ్చు.
- వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు మరింత సురక్షితమైనవి. ఏవైనా చెల్లింపులు జరపాల్సి వచ్చినప్పుడు స్వైపింగ్ చేసే పని ఉండదు. అందువల్ల మోసపూరిత కార్యకలాపాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి.
- వర్చువల్ క్రెడిట్ కార్డులతో చేసే లావాదేవీలపై ఒక పరిమితిని (స్పెండింగ్ లిమిట్) కూడా సెట్ చేసుకోవచ్చు. మీ ఫోన్‌కి వచ్చే వన్-టైమ్ పాస్‌వర్డ్‌ల (OTPల) ద్వారా చెల్లింపులు జరుపవచ్చు.
- వర్చువల్ క్రెడిట్ కార్డుపై పరిమితిని సెట్ చేయడం ద్వారా ఒక మంచి ప్రయోజనముంది. ఉదహరణకు క్రెడిట్ కార్డ్‌పై రూ.10 వేల పరిమితిని సెట్ చేశారని అనుకోండి. ఏదైనా అనుకోకుండా ఫ్రాడ్ జరిగితే, అప్పుడు మీ అకౌంట్ నుంచి రూ.10 వేలు మాత్రమే కట్ అవుతాయి. అంతకుమించి నష్టపోయే అవకాశం ఉండదు.
వర్చువల్ క్రెడిట్ కార్డు పరిమితులు
Limitations Of Virtual Credit Cards :
- ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం వర్చువల్ క్రెడిట్ కార్డులను ఉపయోగించలేం. వీటిని ఆన్లైన్లో మాత్రమే వినియోగించే అవకాశముంది. అందువల్ల ప్రయాణాలు చేసేటప్పుడు వర్చువల్ క్రెడిట్ కార్డులను సరిగ్గా వాడుకోలేము. కానీ త్వరలోనే ఇది మారే అవకాశం ఉంది.
- యూపీఐ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, వినియోగదారులు తమ వర్చువల్ రూపే కార్డుల్ని యూపీఐతో లింక్ చేసుకొని, వాడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వీసా లేదా మాస్టర్ కార్డ్ హోల్డర్లకు ఈ అవకాశం లేదు. పైగా నేడు కేవలం కొన్ని బ్యాంకులు మాత్రమే UPIలో రూపే క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేసుకోవడానికి అనుమతిస్తున్నాయి.
- వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను వాడుకోవడానికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. అందువల్ల లో-కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో, ఇంటర్నెట్ సదుపాయం లేని ఏరియాల్లో వీటిని ఉపయోగించలేం.
- వర్చువల్ కార్డ్‌లకు తక్కువ కాల వ్యవధి ఉంటుంది. అందువల్ల వీటిని దీర్ఘకాలంపాటు వాడుకోవడానికి వీలుపడదు.
- వర్చువల్ క్రెడిట్ కార్డులతో EMI పద్ధతిలో ఆన్‌లైన్ కొనుగోళ్లు చేయలేరు.