Vibrant Gujarat 2024 Mukesh Ambani :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రధాని అని కితాబిచ్చారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ. దేశంలో వచ్చిన మార్పునకు ఆయన ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. వైబ్రంట్ గుజరాత్ సదస్సులో పాల్గొన్న ఆయన 2047 నాటికి భారత్ 35 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదుగుతుందని, దీన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని అన్నారు. ఆ సమయానికి గుజరాత్ ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాతీ కంపెనీయేనని పేర్కొన్న ఆయన తాను గుజరాతీనని గర్వపడుతున్నట్లు చెప్పారు.
"గేట్‌వే ఆఫ్ ఇండియాగా పిలిచే నగరం (ముంబయి) నుంచి ఆధునిక భారతదేశ అభివృద్ధికి కీలకంగా మారిన గుజరాత్‌కు వచ్చాను. నేను గుజరాతీనని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా. విదేశీయులు సరికొత్త భారత్ గురించి ఆలోచించినప్పుడు సరికొత్త గుజరాత్ ప్రస్తావన తప్పక వస్తుంది. ఈ మార్పు ఒక్క నాయకుడి వల్లే వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ నేతగా ఎదిగిన వ్యక్తి, దేశ విజయవంతమైన ప్రధాని మోదీ వల్లే ఇది సాధ్యమైంది. ఇలాంటి ఏ సదస్సు కూడా 20 ఏళ్లకు పైగా కొనసాగలేదు. ప్రధాని మోదీ దార్శనికతకు ఇది నిదర్శనం."
-ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్
ఆత్మనిర్భర్ భారత్ కోసం అదానీ సప్లై చైన్
దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన వ్యవస్థను తాము అభివృద్ధి చేస్తున్నామని ఇదే సదస్సులో పాల్గొన్న అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం గ్రీన్ సప్లై చైన్‌ను విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు. వైబ్రంట్ గుజరాత్ సదస్సు ప్రధాని మోదీ దార్శనికతకు నిదర్శమని పేర్కొన్నారు.
పెట్టుబడుల వెల్లువ
కాగా, వైబ్రంట్ గుజరాత్ సదస్సులో ఆ రాష్ట్రానికి పెట్టుబడులు ప్రవాహంలా వచ్చాయి. అదానీ ఏకంగా రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. ఇందులో అధిక శాతం కచ్‌లో 25 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 25 గిగా వాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న గ్రీన్ ఎనర్జీ పార్క్‌కు వెచ్చించనుంది. ఈ పెట్టుబడులతో లక్ష మందికి ఉపాధి లభించనుందని అదానీ గ్రూప్ తెలిపింది. గతేడాది ప్రకటించిన రూ.55వేల కోట్ల పెట్టుబడుల్లో రూ.50 వేల కోట్లు ఇప్పటికే వెచ్చించినట్లు అదానీ తెలిపారు.
- సూరత్‌లోని హజీరాలో ప్రపంచ స్థాయి కార్బన్ ఫైబర్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. జామ్‌నగర్‌లో 5వేల ఎకరాల్లో ధీరుభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపింది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం భారత్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రిలయన్స్ తరఫున గుజరాత్లో విద్యా, క్రీడల మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని అంబానీ ప్రకటించారు.
- గుజరాత్లో మారుతి సుజుకీ రూ.35వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్రంలో రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా ఏటా పది లక్షల యూనిట్లు ఉత్పత్తి చేస్తామని తెలిపారు.
- ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ తయారీ కేంద్రాన్ని సూరత్‌లోని హజీరాలో నిర్మిస్తున్నట్లు ఏర్సెలోమిత్తల్ ఛైర్పర్సన్ లక్ష్మీ మిత్తల్ ప్రకటించారు. ప్లాంట్ రెండో దశ నిర్మాణానికి గుజరాత్ సర్కారుతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఫేజ్-1 ప్లాంట్ నిర్మాణం కొనసాగుతోందని, 2026లో ఇది అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ ఫ్యాక్టరీ ఏటా 24 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు.
- గుజరాత్‌లోని ధోలేరాలో సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి టాటా ముందుకొచ్చింది. 20 గిగా వాట్ల సామర్థ్యంతో సనంద్‌లో నిర్మించిన లిథియం అయాన్ బ్యాటరీ తయారీ యూనిట్ రెండు నెలల్లో ప్రారంభమవుతుందని తెలిపింది.
రెనో 2024 మోడల్ కార్స్ లాంఛ్ - ఫీచర్స్ అదుర్స్ - ధర ఎంతంటే?
72 గంటల్లోనే రూ.7200 కోట్ల విలువైన ఫ్లాట్లు సేల్- ఎక్కడో తెలుసా?