India's Biggest Trading Partner: భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా అవతరించింది. గతంలో ఈ స్థానంలో ఉన్న చైనాను 2021-22లో యూఎస్ అధిగమించింది. ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధం బలోపేతానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది. కేంద్ర వాణిజ్యశాఖ గణాంకాల ప్రకారం.. 2021-22లో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య విలువ 119.42 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2020-21లో ఇది 80.51 బిలియన్ డాలర్లుగా ఉంది.
2020-21లో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతుల విలువ 76.11 బిలియన్ డాలర్లకు చేరింది. క్రితం ఏడాది ఇది 51.62 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో దిగుమతుల విలువ 29 బిలియన్ డాలర్ల నుంచి 43.31 బిలియన్ డాలర్లకు చేరింది. చైనాతో 2021-22లో ద్వైపాక్షిక వాణిజ్య విలువ 115.42 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆ దేశానికి ఎగుమతులు స్వల్పంగా పెరిగి 21.25 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతుల విలువ 94.16 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
రానున్న రోజుల్లో భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం మరింత బలోపేతం కానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్ విశ్వసనీయ వాణిజ్య భాగస్వామిగా ఎదుగుతోందని.. అంతర్జాతీయ కంపెనీలు చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నాయని 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్' ఉపాధ్యక్షుడు ఖలీద్ ఖాన్ తెలిపారు. అందుకే భారత్ వంటి దేశాలకు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయన్నారు. 2013-14 నుంచి 2017-18 వరకు భారత్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగింది. అంతకుముందు ఆ స్థానంలో యూఏఈ ఉండేది. 2021-22లో 72.9 బిలియన్ డాలర్లతో యూఏఈ మూడో స్థానంలో కొనసాగుతోంది. తర్వాత సౌదీ అరేబియా, ఇరాక్, సింగపూర్ ఉన్నాయి.
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న ప్రధాన వస్తువుల్లో సానపెట్టిన వజ్రాలు, ఔషధ ఉత్పత్తులు, ఆభరణాలు, లైట్ ఆయిల్స్, రొయ్యలు, ఇతర తయారీ వస్తువులు ఉన్నాయి. దిగుమతుల్లో ప్రధానంగా పెట్రోలియం, ముడి వజ్రాలు, సహజవాయువు, బంగారం, బొగ్గు, తుక్కు, బాదం.. వంటివి ఉన్నాయి.