UPI Security Tips : టెక్నాలజీ అందుబాటులో వచ్చిన తరువాత ఆన్లైన్ పేమెంట్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అదే స్థాయిలో ఆన్లైన్ ఫ్రాడ్లు, స్కామ్‌లు కూడా పెరుగుతున్నాయి. అందుకే ఈ ఆర్టికల్‌లో హ్యాకర్ల చేతికి చిక్కకుండా, సురక్షితంగా యూపీఐ పేమెంట్లు చేసేందుకు పాటించాల్సిన టాప్-7 టిప్స్ గురించి తెలుసుకుందాం.
యూపీఐ పిన్ సీక్రెట్‌గా ఉండాలి
యూపీఐ పిన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్‌కు ఒక తాళం చెవిలాంటిది. అందుకే దానిని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. దీనిని కేవలం బ్యాంకింగ్ యాప్‌లోని ఎంట్రీ పేజ్‌లో మాత్రమే ఎంటర్ చేయాలి. గుర్తించుకోండి - కస్టమర్ సపోర్ట్ వారికి కూడా మీ పిన్ను చెప్పకూడదు. ఎందుకంటే, కస్టమర్ సపోర్ట్ వారికి మీ యూపీఐ పిన్‌తో పని ఉండదు.
పేమెంట్ చేసేముందు చెక్ చేసుకోవాలి
మీరు ఎవరికైనా యూపీఐద్వారా డబ్బులు పంపించాలని అనుకుంటే, కచ్చితంగా రెసిపెంట్ పేరును చెక్ చేసుకోవాలి. ఎందుకంటే, పొరపాటున వేరొకరికి డబ్బులు పంపిస్తే, వాటిని వెనక్కు తీసుకోవడం కష్టమవుతుంది.
యూపీఐ పిన్ పేజ్‌లో మాత్రమే ఎంటర్ చేయాలి
మీరు జాగ్రత్తగా గమనిస్తే అన్ని యూపీఐ యాప్‌ల్లోనూ 'యూపీఐ పిన్ ఎంట్రీ పేజ్' ఒకేలా ఉంటుంది. సురక్షితంగా యూపీఐ పేమెంట్స్ చేసేందుకుగాను ఎన్పీసీఐ ఈ సెక్యూర్ గేట్‌వేను రూపొందించింది. కనుక ఈ ఎంట్రీ పేజ్‌లోనే యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. స్కామర్లు యూజర్లను తప్పుదోవ పట్టించడానికి ఫిషింగ్ లింక్స్‌ను పంపిస్తుంటారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేసినా, వాటిలో మీ యూపీఐ పిన్ను ఎంటర్ చేయకూడదు.
అనధికారిక యాప్‌లను డౌన్లోడ్ చేయకూడదు
అనధికారిక యాప్‌లను, ఇతరులు షేర్ చేసిన యాప్‌లను, ఎస్ఎంఎస్ ఫార్వార్డ్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోకూడదు. అలాగే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లను కూడా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోకూడదు. దీని వల్ల ఫోన్ సెక్యూరిటీ సిస్టమ్ దెబ్బతింటుంది. దీనితో స్కామర్లు డివైజ్‌లోని మన వ్యక్తిగత సమాచారాన్ని, ఫైనాన్సియల్ ఇన్ఫర్మేషన్ను చేజిక్కించుకుంటారు. ఫలితంగా మనం ఆర్థికంగా నష్టపోతాం. కనుక ఆఫీషియల్ స్టోర్ నుంచి మాత్రమే ఒరిజినల్ యాప్‌లను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేసుకోవాలి.