UPI Paynow Linkage : భారత్‌లో డిజిటల్ లావాదేవీలు.. త్వరలోనే నగదు లావాదేవీలను అధిగమిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపులు.. దేశంలో క్రమంగా అత్యధిక మంది వినియోగిస్తున్నారని వెల్లడించారు. భారత్-సింగపూర్ మధ్య డిజిటల్ లావాదేవీల వ్యవస్థను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ వర్చువల్ విధానంలో సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్.. RBI గవర్నర్ శక్తికాంతదాస్ పాల్గొన్నారు. 2022లో భారత్‌లో 126 లక్షల కోట్ల విలువైన 7,400 కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు వివరించారు. దేశీయంగా రూపొందించిన చెల్లింపుల వ్యవస్థ ఎంత సురక్షితమైనదో ఈ లావాదేవీలు తెలియజేస్తున్నాయన్నారు. UPI- పే నౌ అనుసంధానంతో.. భారత్- సింగపూర్ దేశాల ప్రజలు సులభంగా, సురక్షితంగా నగదు చెల్లింపులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. సింగపూర్‌లోని భారతీయులకు ముఖ్యంగా వలస కార్మికులు, విద్యార్థులు తక్కువ ఖర్చుతో చెల్లింపులు చేసుకోవచ్చని చెప్పారు.
"యూపీఐ- పే నౌ అనుసంధానం రెండు దేశాల ప్రజలకు ఒక బహుమతి లాంటిది. దీని ద్వారా రెండు దేశాల్లోని ప్రజలు తమ సెల్‌ఫోన్ నుంచి తక్షణమే తక్కువ ఖర్చుతో నగదు చెల్లింపు చేయడానికి సహాయపడుతుంది. ఇవాళ ప్రత్యక్ష డిజిటల్ చెల్లింపుల విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్రదేశాల్లో నిలిచింది. నేడు యూపీఐ భారత్‌లో అందరికీ ప్రాధాన్యత కలిగిన చెల్లింపుల వ్యవస్థగా మారింది. 2022లో యూపీఐ ద్వారా 126 లక్షల కోట్లకుపైగా చెల్లింపులు జరిగాయి. భారత నగదు చెల్లింపుల వ్యవస్థ ఎంత సులభంగా, సురక్షితంగా నిర్వహించబడుతుందో ఇది తెలుపుతుంది. త్వరలోనే భారత్‌లో నగదు చెల్లింపుల కన్నా డిజిటల్ లావాదేవీలు అధికమవుతాయని చాలామంది నిపుణులు చెపుతున్నారు."
నరేంద్రమోదీ, ప్రధానమంత్రి