Upcoming EV SUV Cars In India 2023 Under 10 Lakhs : ప్రస్తుతం భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు బాగానే జరుగుతున్నాయి. అందులో ఎలక్ట్రిక్ ఎస్యూవీ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. కానీ ధర కాస్త ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మారుతీ, టాటా, హ్యుందాయ్ వంటి కంపెనీలు.. కేవలం రూ.10లక్షల లోపే ఎస్యూవీ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఆ కార్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసకుందాం.
టాటా పంచ్ ఈవీ..
Tata Punch EV Price :టాటా పంచ్ ఈవీ మోడల్ కారును త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది టాటా కంపెనీ. 2023 చివర్లో లేదంటే 2024 సంవత్సర ప్రారంభంలో గానీ మార్కెట్లోకి ఈ కారు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కారును ఎంతో ఆకర్షణీయంగా రూపొందించింది టాటా కంపెనీ. ఎక్కువ భద్రత ప్రమాణాలతో కారును అందుబాటులోకి తీసుకువస్తోంది. దీని ధర రూ.10లక్షలోపే ఉండే అవకాశం ఉంది.
ఈ కారు రెండు పవర్‌ట్రైన్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది..
- 19.2kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన మోడల్ కారు. ఇది 110Nm టార్క్‌తో 61BHP పవర్ జనరేట్ చేస్తుంది.
- 24kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన మోడల్ కారు. ఇది 114Nm టార్క్‌తో 74BHP పవర్ జనరేట్ చేస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీ..
Hyundai Exter EV :ఇటీవలే మార్కెట్లోకి ఆరంగ్రేటం చేసిన హ్యుందాయ్ ఎక్స్టర్కు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. వాహనాల అమ్మకాలు సైతం అదే తరహాలో జరిగాయి. కొద్ది రోజుల్లో విడుదలయ్యే హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎలక్ట్రిక్ కారుకు కూడా అదే మాదిరి స్పందన ఉంటుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీ కారు.. 2024 సంవత్సరం మధ్యలో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని టెస్టింగ్ ప్రారంభ దశలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈవీ కార్లకు హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీ గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధర కూడా రూ.10 లక్షల లోపే ఉండొచ్చని సమాచారం.
ఈ కారుకు సంబంధించి పూర్తి వివరాలను హ్యుందాయ్ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కాకపోతే దీని బ్యాటరీ సామర్థ్యం 25kWh నుంచి 30kWh ఉండొచ్చని మార్కెట్ నిపుణల అభిప్రాయం. దీంతో బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 300 నుంచి 350 కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చని తెలుస్తోంది.
మారుతి సుజుకీ ఫ్రాంక్స్ ఈవీ..
Maruti Suzuki Fronx EV :2030 నాటికి మొత్తం ఆరు కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది మారుతి సుజుకీ. ఇప్పటికే అందులో కొన్నింటిని విడుదల చేసింది. తమ ప్లానింగ్‌లో భాగంగానే 2023 సంవత్సరం కూడా ఫ్రాంక్స్ ఈవీ కారును లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది మారుతీ సుజుకీ. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను సుజుకీ ఇంకా వెల్లడించలేదు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫ్రాంక్స్ ఈవీ వాహనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 నుంచి 450 కిలో మీటర్లు ప్రయాణం చేస్తుందని సమాచారం. ఈ కారు ధర రూ.10లక్షల లోపే ఉండే అవకాశం ఉన్న కారణంగా ఈ సెగ్మెంట్లో మంచి ఆప్షన్ అయ్యే సూచనలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Honda New Bike launch : అదిరే ఫీచర్లతో.. హోండా ఎస్పీ 125, బజాజ్ పల్సర్ ఎన్150 బైక్స్ లాంఛ్.. ధర ఎంతంటే?
Honda Activa Limited Edition Scooter Launch 2023: హోండా నుంచి సరికొత్త స్కూటీ.. అదిరిపోయే ఫీచర్స్!