Upcoming Electric Scooter In India 2023 : భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకున్న ఈవీ తయారీ సంస్థలు.. వినియోగదారుల కోసం సరికొత్త స్కూటర్లను రూపొందిస్తున్నాయి. దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థలు సైతం ఈ స్కూటర్లను తయారు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటిలో కొన్ని సంస్థలు వాహనాలకు అన్ని రకాల ట్రయల్స్‌ను పూర్తి చేసి.. కొద్ది రోజుల్లోనే వాటిని విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. కాగా త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే.. ఐదు వాహనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ..
కొద్ది వారాల్లోనే ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వినియోగదారులు ముందుకు తీసుకురానుంది టీవీఎస్. సరికొత్త ఫీచర్లతో తయారు చేసిన 'టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ'ని 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది సంస్థ. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందన్న ఆంచనాలతో వస్తుంది టీవీఎస్. 4.56kWh బ్యాటరీ సామర్థ్యాన్ని ఈ స్కూటర్ కలిగి ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. దాదాపు 145 కిలోమీటర్లు వరకు ప్రయాణం చేయవచ్చు. 'టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ' స్కూటర్ గరిష్ఠంగా 82 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వాయిస్ అసిస్ట్ వంటి కొత్త అదనపు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
సుజుకి ఈ-బర్గ్‌మాన్..
సుజుకి ఈ-బర్గ్‌మాన్ స్కూటర్‌ను 2023 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది సంస్థ. భారత్‌లో దీని టెస్ట్ రైడ్లు సైతం చాలా సార్లు జరిగాయి. అన్నీ సవ్యంగా సాగితే.. 2024లో సుజుకి ఇ-బర్గ్‌మాన్ స్కూటర్ భారత రోడ్లపై చూడొచ్చు. కాకపోతే దీని విడుదలకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. స్కూటర్ ఫీచర్ల గురించి కూడా పూర్తి వివరాలు వెల్లడికాలేదు. 4kW బ్యాటరీ సామర్థ్యంతో స్కూటర్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 44 కిలో మీటర్లు వరకు ప్రయాణం చేయవచ్చని సమాచారం. గరిష్ఠ వేగం 60 కిలోమీటర్లు.