తెలంగాణ

telangana

ETV Bharat / business

వెయ్యి కొత్త కోచ్​లు.. సూపర్ ఫాస్ట్ ట్రైన్స్​.. రైల్వే శాఖకు బడ్జెట్ బూస్ట్ - రైల్వే బడ్జెట్​ 2023

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ తన బడ్జెట్​లో రైల్వే శాఖకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయించారు. నూతన కోచ్​ల తయారీకి, వందేభారత్ రైళ్ల పెంపునకు పలు ప్రతిపాదనలు చేశారు. రైల్వే మూలధన వ్యయాన్ని భారీగా పెంచినట్లు తెలిపిన ఆర్థిక మంత్రి.. 2013-2014 బడ్జెట్​తో పోలిస్తే.. ఇప్పుడు కేటాయించిన మొత్తం తొమ్మిది రెట్లు ఎక్కువని తెలిపారు.

union-budget-of-india-2023
భారత యూనియన్ బడ్జెట్ 2023

By

Published : Feb 1, 2023, 1:32 PM IST

కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు 2.40 లక్షల కోట్ల రూపాయలను ప్రదిపాదించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. బుధవారం ప్రవేశపెట్టిన 2023-24 కేంద్ర బడ్జెట్‌లో.. రైల్వే మూలధన వ్యయాన్ని భారీగా పెంచినట్లు ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2013-2014 బడ్జెట్​తో పోలిస్తే.. ఇప్పుడు కేటాయించిన మొత్తం తొమ్మిది రెట్లు ఎక్కువని తెలిపారు. బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాల రంగాల అభివృద్ధికి.., సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు వంద కీలకమైన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించినట్లు బడ్జెట్​ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. వీటిపై ప్రాధాన్య క్రమంలో రూ.75వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ఇందులో రూ.15వేల కోట్ల ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఉండనున్నట్లు పేర్కొన్నారు.

రైళ్లలో ప్రజల ప్రయాణాలు మరింతగా పెరుగుతాయన్న అంచనాలతో మరో 1000 కోచ్​లను పునరుద్ధరించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వీటిని రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్‌సఫర్, తేజస్ వంటి ప్రీమియర్ రైళ్లలో ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఈ కోచ్​లను ఆధునాతన రూపంలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా తయారు చేయనున్నట్లు తెలిపారు.

రైళ్ల వేగాన్ని పెంచాలని, వందేభారత్​ రైళ్లను మరిన్ని మార్గాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకోనున్నట్లు బడ్జెట్​ ద్వారా తెలిపింది. పాత రైల్వే ట్రాకులను మార్చేందుకు ఎక్కువ ఖర్చు చేయనున్నట్లు సంకేతాలిచ్చింది. పర్యటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా వంద విస్టాడోమ్ కోచ్​లను తయారు చేయాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది. 35 హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైళ్లు, సైడ్ ఎంట్రీతో కొత్తగా డిజైన్​ చేసిన 4,500 ఆటోమొబైల్ క్యారియర్ కోచ్‌లు, 5,000 ఎల్​ఎచ్​బీ కోచ్‌లు, 58,000 వ్యాగన్ల తయారీకి కేంద్రం బడ్జెట్​లో ప్రతిపాదనలు చేసింది.

ABOUT THE AUTHOR

...view details