మునుపటిలా తిరుక్కురల్ నీతిసూత్రాల్లేవు. పెద్దగా మహనీయుల హితోక్తులూ లేవు. వారణాసి విశ్వనాథుడి సన్నిధిలో వినిపించే సప్తర్షి (సప్తరుషి) పదాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగానికి ఆలంబనగా చేసుకున్నారు. 30 పేజీల తన ఐదో బడ్జెట్ ప్రసంగాన్ని గంటా 26 నిమిషాల్లో పూర్తి చేశారు. దీన్ని అమృతకాలంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌గా అభివర్ణించుకున్న ఆమె... పెద్దగా ప్రజాకర్షక అంశాల జోలికి పోకుండా బడ్జెట్ బండిని జాగ్రత్తగా నడిపే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీ తొలినుంచీ చెబుతున్న సమ్మిళిత అభివృద్ధి, చిట్టచివర ఉన్న వ్యక్తికీ ప్రభుత్వ ప్రయోజనాలు అందించడం, మౌలికవసతులు, పెట్టుబడుల ఆకర్షణ, శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం, హరితరంగాలకు ప్రాధాన్యం ఇవ్వడం, యువశక్తిని గరిష్ఠస్థాయిలో ఉపయోగించుకోవడం, ఆర్థికరంగాన్ని సుస్థిరంగా ముందుకుసాగించడానికే... అత్యంత ప్రాధాన్యమిచ్చారు. వాటికి 'సప్తర్షి'మార్గంగా నామకరణం చేశారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్‌లను సవరించి.. కొత్త పథకాన్ని ఎంచుకునే వారికి రూ.7 లక్షల దాకా ఎలాంటి పన్ను భారం లేకుండా వేతనదారులకు కాసింత ఊరటనిచ్చారు.
10 నుంచి 5కు చేరాం...
2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి దేశ ప్రజల తలసరి ఆదాయాన్ని రెట్టింపుచేసి రూ.1.97 లక్షలకు తీసుకెళ్లినట్లు ఆర్థిక మంత్రి ఘనంగా ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తెచ్చినట్లు పేర్కొన్న ఆమె రాబోయే 25 ఏళ్లలో మహిళా ఆర్థిక సాధికారత, సంప్రదాయ హస్తకళాకారులకు నైపుణ్య శిక్షణ, పర్యాటకరంగ ప్రోత్సాహం, పర్యావరణ అనుకూల విధానాలకు చేయూతనివ్వడం ద్వారా కొత్త అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నట్లు ప్రకటించారు. చిరుధాన్యాలకు 'శ్రీఅన్న'గా నామకరణం చేసి ఆ రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. ఈ బడ్జెట్‌లో పలు కొత్త పథకాలను ప్రకటించారు.
- కృత్రిమ ఎరువుల వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా 'ప్రధానమంత్రి- వ్యవసాయ నిర్వహణకు ప్రత్యామ్నాయ పోషకాల ప్రోత్సాహం (పీఎం-ప్రణామ్)' పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించే రాష్ట్రాలకు ఈ పథకం కింద ప్రోత్సాహకాలు అందజేస్తారు.
- విలువైన ఉద్యాన పంటలు వేసేందుకు నాణ్యమైన పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చేలా రూ.2,200 కోట్లతో ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు.
- చిత్తడి నేలలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించేందుకు, జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు రానున్న మూడేళ్లపాటు 'అమృత్ ధరోహర్' పథకాన్ని అమలు చేయనున్నారు.
- చక్రీయ ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ)ను ప్రోత్సహించేందుకు రూ.10 వేల కోట్ల పెట్టుబడితో గోవర్ధన్ పథకాన్ని ప్రకటించారు.
- తొలి దశలో లక్ష పురాతన శిలాశాసనాల్లోని వివరాలను డిజిటల్ రూపంలో భద్రపర్చడానికిగాను డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియంలో ప్రత్యేకంగా శాసన భండారాన్ని ఏర్పాటుచేయనున్నారు.
- 30 అంతర్జాతీయ నైపుణ్య భారత్ కేంద్రాల ఏర్పాటు. లక్షల మంది యువత కోసం ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన-4.0’ ప్రారంభం.
- కొత్తగా మిష్ఠీ పథకం కింద.. తీరప్రాంతాల వెంబడి మడ అడవుల పెంపకం.
- 'ఒక జిల్లా - ఒక ఉత్పత్తి' పరిధిలోని ఉత్పత్తులు, జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) వస్తువుల ప్రచారం, విక్రయాల కోసం యూనిటీ మాల్‌లను ఏర్పాటుచేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహం.
- హైదరాబాద్‌లోని మిల్లెట్ ఇన్‌స్టిట్యూట్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్రం సహకారం.
- కేవైసీ ప్రక్రియను సరళీకరించడంతో పాటు వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచేందుకు జాతీయ డేటా గవర్నెన్స్ విధానం.
- గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్) తరహాలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (యూఐడీఎఫ్) ఏర్పాటు.
- ఆదిమ కాలం నాటి గిరిజన తెగల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు రాబోయే మూడేళ్ల పాటు రూ.15 వేల కోట్లతో ‘ప్రధానమంత్రి - నిర్దిష్ట దుర్బల గిరిజన తెగల (పీఎం-పీవీటీజీ)’ అభివృద్ధి కార్యక్రమం అమలు.
- సహకార సంఘాల పనితీరును పర్యవేక్షించేందుకు జాతీయ సహకార డేటాబేస్‌కు రూపకల్పన.
- ఈ-కోర్టుల మూడోదశ పథకానికి రూ.7 వేల కోట్లు కేటాయించడం ద్వారా న్యాయాన్ని వేగంగా అందించడానికి ఉన్న అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేశారు.
- ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు 66% కేటాయింపులు పెంచి పేదల ఇళ్ల నిర్మాణంలో రాబోయే వేగాన్ని చూపించారు.
- వ్యవసాయ, అనుబంధ రంగాలకు అందించే రుణాలను రూ.20 లక్షల కోట్లకు పెంచుతున్నామని ప్రకటించడం ద్వారా రైతులకు పెట్టుబడిపరమైన ఇబ్బందులు లేకుండా భరోసా కల్పించారు. రాబోయే మూడేళ్లలో కోటిమంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు 10 వేల బయోఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
మూలధనం పెంపుతో ఉపాధికి బాట
బడ్జెట్‌లో ప్రభుత్వ మూలధన వ్యయాన్ని 33% పెంచి రూ.10 లక్షల కోట్లమేర కేటాయించడం ద్వారా దేశంలో మౌలికవసతులు తద్వారా ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం ఇవ్వబోతున్న ప్రాధాన్యాన్ని మంత్రి చాటి చెప్పారు. రాష్ట్రాలుచేసే మూలధన వ్యయానికి చేయూతనివ్వడానికి ప్రస్తుతం కల్పిస్తున్న 50 ఏళ్ల వడ్డీ రహిత రుణ సౌకర్యాన్ని మరో ఏడాది పొడిగించారు. తద్వారా ఆర్థిక స్థిరత్వం విషయంలో రాష్ట్రాలను కలుపుకొనిపోయే ప్రయత్నం చేశారు. తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చేసే మూలధన వ్యయం మొత్తం రూ.13.7 లక్షల కోట్లకు చేరనుంది. రైల్వేలకూ మూలధన వ్యయం కింద రూ.2.40 లక్షల కోట్ల కేటాయింపు, రూ.75 వేల కోట్ల పెట్టుబడితో 100 లాజిస్టిక్స్ ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాంతీయ అనుసంధానం కిందికి కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు తీసుకురావడం ద్వారా ఆర్థిక వృద్ధికి రెక్కలు తొడిగే ప్రయత్నం చేశారు.
హరిత ఇంధన విప్లవం
2070 నాటికి కర్బన ఉద్గారాలు లేని ఇంధన వ్యవస్థను సృష్టించాలన్న లక్ష్యంతో గ్రీన్‌హైడ్రోజన్ మిషన్‌కు రూ.19,700 కోట్లు, ఇంధన రూపాంతరీకరణ కార్యక్రమానికి రూ.35 వేల కోట్లు, లద్దాఖ్ నుంచి 13 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్‌తో అనుసంధానించే సరఫరా వ్యవస్థ నిర్మాణానికి రూ.20 వేల కోట్లు కేటాయించడం ద్వారా హరిత ఇంధన రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేశారు. మూలధన వ్యయ కేటాయింపులను 33%కే పరిమితం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పాత బడ్జెట్‌లో రూ.89,400 కోట్లు ఖర్చుకాగా, తాజా బడ్జెట్‌లో దాని కేటాయింపులను రూ.60 వేల కోట్లకు కుదించారు.
కర్ణాటకపై కరుణ
త్వరలో ఎన్నికలకు వెళుతున్న భాజపా పాలిత కర్ణాటకకు నిధుల రూపంలో ఆర్థిక మంత్రి ప్రత్యేక కరుణ చూపించారు. కర్ణాటకలోని కరవుపీడిత ప్రాంతంలో సూక్ష్మసేద్యం కల్పించడానికి రూ.5,300 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పడం ద్వారా పక్షపాతాన్ని ప్రదర్శించారు. కర్ణాటకను ఆనుకొని ఉన్న వెనుకబడిన రాయలసీమప్రాంతంలో, ఇదే సంవత్సరం ఎన్నికలకు వెళ్తున్న తెలంగాణలో కరవు అంతకుమించి ఉన్నప్పటికీ వాటికి సూక్ష్మసేద్య వరాలేమీ ప్రకటించలేదు. వరుసగా ఈ బడ్జెట్‌లోనూ ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
పట్టణ పన్నుల పెంపునకు సంకేతం
మున్సిపల్ బాండ్ల జారీకి తగ్గట్టు పట్టణ స్థానిక సంస్థలు తమ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవాలని చెప్పడం ద్వారా పట్టణాల్లో పన్నులు పెంచాలనే సంకేతం ఇచ్చారు. గ్రామీణ మౌలికవసతుల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్) తరహాలో రూ.10 వేల కోట్లతో పట్టణ మౌలికవసతుల అభివృద్ధి నిధిని ఏర్పాటుచేసి ద్వితీయ, తృతీయ అంచెల్లోని పట్టణాల్లో మౌలిక వసతులు ప్రకటించడం ద్వారా కిందిస్థాయి పట్టణాలకు మెరుగులుదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు.
కేంద్రానిదీ అప్పుల బాటే
ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పదో బడ్జెట్... కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదని చెప్పకనే చెప్పింది. బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్థిక లోటు లెక్కలే అందుకు నిదర్శనం. 2022-23లో కేంద్ర ప్రభుత్వ ఆర్థికలోటు 6.4% మేర నమోదైంది. 2023-24లో అది 5.9%కి పరిమితమవుతుందని మంత్రి ప్రకటించారు. ఈ లోటును భర్తీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రూ.11.8 లక్షల కోట్లు, చిన్నమొత్తాల పొదుపు, ఇతర మార్గాల నుంచి రూ.3.6 లక్షల కోట్లు కలిపి మొత్తం రూ.15.4 లక్షల కోట్ల రుణం సమీకరించాలని నిర్ణయించింది. ఈ వనరుల సమీకరణకు ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి సీనియర్ సిటిజన్ల డిపాజిట్ పరిమితులు, నెలవారీ ఆదాయ ఖాతా పథకంలో పొదుపుచేసే గరిష్ఠ సొమ్మును రెట్టింపు చేసింది.
చరిత్రాత్మక బడ్జెట్: మోదీ
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. అణగారిన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీన్ని చరిత్రాత్మక బడ్జెట్ అని అభివర్ణించారు. దేశ అభివృద్ధి కలల సాకారానికి పునాది పడేలా బడ్జెట్‌కు రూపకల్పన చేశారని.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ప్రశంసలు కురిపించారు.
'తాజా బడ్జెట్ చరిత్రాత్మకమైనది. సమాజంలో అణగారిన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూనే.. భారత అభివృద్ధి కలల సంకల్పాన్ని నెరవేర్చేందుకు అమృత కాల తొలి బడ్జెట్ పునాది వేస్తుంది. ఆశల సమాజం, రైతులు, మధ్యతరగతి వర్గాల స్వప్నాలను నెరవేరుస్తుంది. సుసంపన్న, 2047 ఏడాది భారత అభ్యున్నతి లక్ష్యాలను సాకారం చేసే గొప్ప శక్తి మధ్య తరగతిది. ఈ వర్గం సాధికారతకు మా ప్రభుత్వం కొన్నేళ్లుగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా వారికి భారీ పన్ను ఉపశమనాలు కలిగించాం. సంప్రదాయ కళాకారులైన వడ్రంగులు, కమ్మర్లు, స్వర్ణకారులు, కుమ్మర్లు, శిల్పకారులు జాతి నిర్మాతలు. తొలిసారి ఇటువంటి వారందరి కోసం పలు పథకాలు తీసుకొచ్చాం. శిక్షణ, రుణాలు, మార్కెట్ మద్దతు వంటివి అందులో ఉన్నాయి. మరింత బలోపేతం చేయడం ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలు అద్భుతాలు సృష్టిస్తాయి. బడ్జెట్‌లో తీసుకొచ్చిన ప్రత్యేక పొదుపు పథకాలు సాధారణ కుటుంబాల్లోని మహిళలను శక్తిమంతం చేస్తాయి. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార నిల్వ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. విజయవంతమైన డిజిటల్ చెల్లింపుల విధానం వ్యవసాయ రంగంలోనూ ఆవిష్కృతం కావాలి. ఇందుకోసం డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తున్నాం. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఇరుసుగా సహకరిస్తుంది. మౌలిక రంగంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా చేస్తున్న రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి అభివృద్ధికి వేగాన్ని, కొత్త శక్తిని అందిస్తుంది. యువతకు ఉపాధి కల్పిస్తుంది. దేశ అభివృద్ధి నిర్మాణానికి దోహదపడే బడ్జెట్‌ను రూపొందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు, ఆమె బృందానికి అభినందనలు.'
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఉపాధి ఆలోచనేదీ?
'దేశంలో ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణం నియంత్రణ వంటి ఆలోచనల్లేని మోదీ ‘మిత్ర్ కాల్’ బడ్జెట్ ఇది. భావి భారత నిర్మాణానికి కేంద్రం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని రుజువైపోయింది. అసమానతలు తగ్గించే ఉద్దేశమే వీరికి లేదు. ఒక శాతం ధనికుల వద్ద 40 శాతం సంపద పేరుకుపోయింది. 42 శాతం యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది. అయినా ప్రధానికి ఏమీపట్టదు' అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.