అటు ఉరుముతున్న ఆర్థికమాంద్యం.. ఇటు తరుముకొస్తున్న ఎన్నికలు.. ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేయాలా? జనాకర్షణకు పట్టం కట్టాలా? కేంద్ర బడ్జెట్ వేళ మోదీ సర్కారు ముంగిట నిలిచిన అతిపెద్ద సవాళ్లు ఇవి. తరాజు ఎటువైపు ఎక్కువగా మొగ్గినా రెండో దానిపై తీవ్ర ప్రభావం తప్పదు. అత్యంత చాకచక్యంగా అడుగులేయాల్సిన తరుణమిది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంత నిర్మాణాత్మకంగా ముందుకు వెళతారనే దానిని ఇప్పుడు యావద్దేశం ఆసక్తితో గమనిస్తోంది.
తాయిలాలను ఆశిస్తున్న భిన్నవర్గాల్ని సంతృప్తిపరుస్తూనే.. దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు తీయించడానికి బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలను ఆమె చేయబోతున్నారనేది అత్యంత కీలకాంశం. పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్థాన్‌లను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
వరుస కట్టిన సవాళ్లు
కరోనా నుంచి కోలుకునే లోపే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రూపంలో మరో పిడుగు.. ఆ వెంటే తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఈ సమస్యలకు తోడు సరిహద్దుల్లో చైనా కవ్వింపులతో దేశ రక్షణ రంగానికి కేటాయింపులు భారీగా పెంచాల్సిన అనివార్యతను భారత ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అదే సమయంలో అధిక ధరలు, నిరుద్యోగంతో కుదేలవుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాదిలోనే పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు వెళ్లే లోపు పూర్తిస్థాయిలో ప్రవేశ పెట్టే చివరి బడ్జెట్ ఇదే కావడంతో వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికీ ప్రాధాన్యమివ్వక తప్పదు. ఇన్ని అనివార్యతల మధ్య బుధవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు పెద్ద పరీక్షే! బడ్జెట్ లోటును తగ్గిస్తూనే ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ప్రస్పుటమవుతోంది.
ఆశల పల్లకీలో మధ్యతరగతి
ఏటా బడ్జెట్ అనగానే ప్రతి రంగం కొన్ని ప్రయోజనాలను ఆశించటం సహజం. ఈసారి మధ్యతరగతి మాత్రం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ప్రపంచవ్యాప్త ఆర్థిక, సామాజిక పరిణామాల ప్రభావం భారత మధ్యతరగతిపైనా పడింది. ముఖ్యంగా రూ.5-10 లక్షల మధ్య వార్షికాదాయ వర్గంపై ద్రవ్యోల్బణ భారం భారీగానే ఉంది. ఎలాంటి రాయితీలకు నోచుకోని ఈ వర్గం కేంద్ర బడ్జెట్‌పైనే ఆశలు పెట్టుకుంది. తగ్గుతున్న ఆదాయం, పెరుగుతున్న జీవన వ్యయాలు, ఉద్యోగాల్లో కోతలు.. తదితరాల నుంచి తమకు ఊరటనిచ్చే ప్రకటనలేమైనా మోదీ ప్రభుత్వం చేస్తుందేమోనని వీరంతా ఆశిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల్లోనూ భాజపాకు మధ్యతరగతిని బలమైన మద్దతుదారుగా భావిస్తుంటారు. కాబట్టి వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చూసినా.. వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకొని ఈ వర్గం పట్ల ఆర్థికమంత్రి కరుణ చూపించే అవకాశాలున్నాయనేది అంచనా.