తెలంగాణ

telangana

ETV Bharat / business

మాంద్యం భయాలు.. పన్ను పరిమితి పెంపుపై ఆశలు.. నిర్మలమ్మ బడ్జెట్​ భరోసా ఇచ్చేనా? - కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు 2023

కరోనా అనంతరం కోలుకున్న భారత ఆర్థిక వ్యవస్థను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు బుధవారం పార్లమెంట్​లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా మందగమనం నెలకొన్న నేపథ్యంలో తాజా బడ్జెట్​లో విత్తమంత్రి ఎలాంటి కేటాయింపులు చేయనున్నారోనని యావద్దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

UNION BUDGET 2023
UNION BUDGET 2023

By

Published : Jan 31, 2023, 5:32 PM IST

ప్రపంచ దేశాలపై మాంద్యం ముప్పు ముసురుతున్న సమయంలో దేశ ఆర్థిక వృద్ధే లక్ష్యంగా మోదీ సర్కారు కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టనుంది. కరోనా తర్వాత గాడినపడ్డ దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత వేగం అందించేలా కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్.. బుధవారం పార్లమెంట్​లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలోని మోదీ సర్కారు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుండటం వల్ల.. దీనిపై మరింత ఆసక్తి ఏర్పడింది. వేతన జీవులు పన్ను మినహాయింపులపై ఆశలుపెట్టుకోగా.. పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వం నుంచి పలు ప్రయోజనాలను ఆశిస్తున్నాయి. మరోవైపు, విత్త లోటును అదుపు చేయడం కేంద్ర ప్రభుత్వానికి సవాల్​గా మారనుంది.

బడ్జెట్​కు ముందు 2023 ఆర్థిక సర్వే మంగళవారం పార్లమెంట్​ ముందుకు వచ్చింది. ప్రపంచంలో భారత్‌ అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని ఆర్థిక సర్వే తెలిపింది. 2022- 23లో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. 2023- 24లో అది 6.5 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. 'పర్చేజింగ్‌ పవర్‌ ప్యారిటీ (PPP)' పరంగా చూస్తే ప్రపంచంలోనే భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని పేర్కొంది. మహమ్మారి సమయంలో స్తంభించిన భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు పూర్తిగా కోలుకుందని.. నిలిచిపోయిన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని ఆర్థిక సర్వే వివరించింది.

వేతన జీవులకు వరాలు?
వచ్చే బడ్జెట్‌లో ఆదాయ పన్ను శ్లాబులు మారుస్తారని, స్టాండర్డ్‌ డిడక్షన్‌ను, పన్ను మినహాయింపు మొత్తాలను పెంచుతారని వేతన జీవులు ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగ విరమణ చేసినవారు పాత పింఛన్‌ విధానం మళ్లీ వస్తుందని ఎదురుచూస్తున్నారు. ఆ అవకాశమే లేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేసినా, విశ్రాంత ఉద్యోగులు ఆశ వీడటం లేదు. మధ్యతరగతి ప్రజలకు ద్రవ్యోల్బణం వల్ల జీవన వ్యయం పెరుగుతున్నా 2014 నుంచి వారి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షల వద్దనే నిలిచిపోయింది. దీన్ని పెంచడం వల్ల అసంఖ్యాక వేతన జీవులకు ఎంతో ఊరట లభిస్తుంది.

  • పరిశ్రమలకు రాయితీలు?
    • వ్యాపారాలపై పన్నులు తగ్గించి, కొన్ని సెస్సులను తొలగించినా కొత్త బడ్జెట్‌ మరింతగా పన్ను రాయితీలను అందిస్తుందని వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి.
    • ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐ) మరికొంత కాలం పొడిగించాలని పారిశ్రామిక రంగం ఆశిస్తోంది.
    • అంకుర సంస్థలకు నూరు శాతం పన్ను విరామం, ప్రవాస భారతీయులు ఆర్జించే వడ్డీపై తక్కువ పన్ను, విద్యుత్‌ వాహనాల కొనుగోలు రుణాలపై వడ్డీ తగ్గింపు, గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో నెలకొల్పిన పరిశ్రమలకు పన్ను రాయితీలను కొత్త బడ్జెట్‌ లోనూ కొనసాగించాలని పారిశ్రామిక రంగం కోరుకొంటోంది.
    • సౌర విద్యుదుత్పాదనకు ఉపయోగించే సౌర ఫలకాలపై పెట్టుబడులకు కొన్నేళ్ల క్రితం వరకు పూర్తి తరుగుదలను అనుమతించేవారు. దాన్ని పునరుద్ధరిస్తే వ్యక్తులకు, వ్యాపారాలకు ఎంతో వెసులుబాటుగా ఉంటుంది.

విద్య, వైద్యంపై పెట్టుబడులు
భారతీయుల దీర్ఘకాల ఆహార భద్రతకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి. మన యువతకు వృత్తి నైపుణ్యాలను పెంచి, వారి కోసం పెద్దయెత్తున శాశ్వత ఉద్యోగాలను సృష్టించాలి. విద్య, వైద్యంపై ప్రభుత్వ పెట్టుబడులను పెంచడం దీనికి బాటలు వేస్తుంది. నూతన విద్యావిధానంలో ప్రతిపాదించిన లక్ష్యాలను అందుకోవాలంటే ఇప్పటి నుంచి 2030 వరకు ఏటా ఆరు శాతం జీడీపీని ఆధునిక విద్యా వసతులపై వెచ్చించాలి. మరిన్ని పాలిటెక్నిక్‌లను, ఇతర సాంకేతిక విద్య శిక్షణ సంస్థలను స్థాపించి విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలను నేర్పాలి. ఉపాధ్యాయులకూ అధునాతన శిక్షణ ఇచ్చి వారి బోధన నైపుణ్యాలను ఇనుమడింపజేయాలి. సామర్థ్యానికి తగినట్లు జీతభత్యాలు పెంచాలి. పంట దిగుబడులు తగ్గుతున్న నేపథ్యంలో వ్యవసాయ పరిశోధనలపై పెట్టుబడులను అధికం చేయాలి. ఓట్లను ఆకర్షించడం కోసం పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి. దానివల్ల ఆ రాష్ట్రాలు ఆర్థికంగా దివాలా తీయకతప్పదు. దీన్ని నివారించడానికి కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులకూ నూతన పింఛన్‌ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలి. ఇటువంటి పకడ్బందీ చర్యలతో కేంద్ర బడ్జెట్‌ రూపు దిద్దుకోవాలి.

  • పన్ను వసూళ్లు ఘనం
    • గత సంవత్సరం మోదీ ప్రభుత్వం పన్నుల ఆదాయాన్ని పెంచుకోగలిగినందువల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉంది.
    • 2021తో పోలిస్తే 2022 డిసెంబరు నాటికి కేంద్ర ప్రభుత్వ మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లు 25.90 శాతం పెరిగాయి.
    • రిఫండ్‌ల తరవాత నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 19.81 శాతం పెరిగాయి.
    • 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.13,37,820 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు సమకూరతాయని గత బడ్జెట్‌లో అంచనా వేయగా, వాస్తవంలో వసూళ్లు రూ.14 లక్షల కోట్లకు చేరవచ్చు.

సవాళ్లూ ఉన్నాయ్..
ప్రస్తుతం విత్త లోటు జీడీపీలో 6.4 శాతం, రెవిన్యూ లోటు 3.8 శాతం. 2026 ఆర్థిక సంవత్సరానికల్లా విత్త లోటును 4.5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమలకు భారీ సబ్సిడీలు ఇవ్వడం, ఇతరత్రా ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ఆ లక్ష్యాన్ని అందుకోవడం కష్టమే. ఈ ఏడాది, వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నందువల్ల సబ్సిడీలను తగ్గించడం అసంభవం. కాబట్టి, విత్తలోటుపై ఎలా ముందుకెళ్తారనేది ఆసక్తికరం.

రుణాలు..
ఈ ఏడాది కేంద్రం సగటున నెలకు రూ.1.3 లక్షల కోట్ల చొప్పున అప్పు చేస్తూ వచ్చింది. పన్ను వసూళ్లు పెరుగుతున్నా అప్పులు చేయకతప్పని స్థితి నెలకొంది. 2016 మార్చి నాటికి ప్రభుత్వ రుణ భారం మొత్తం రూ.64 లక్షల కోట్లయితే, నేడు అది రూ.142 లక్షల కోట్ల పైమాటే. ముఖ్యమైన కార్యక్రమాలపై ప్రభుత్వ వ్యయం పెరగడం ఒక్కటే ఊరట కలిగించే అంశం.

బడ్జెట్‌కు ముందు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ కీలక అంచనాలను వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది ప్రకాశవంతమైన స్థానమని ఐఎంఎఫ్‌ తెలిపింది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్‌, చైనాదేనని వెల్లడించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో మందగమనం మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపింది. దేశ ఎకానమీ గాడిన పడ్డట్లు ఆర్థిక సర్వేలోనూ స్పష్టమైన నేపథ్యంలో కేటాయింపులపై కేంద్రం.. ఎలా ముందుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రజాకర్షక పథకాలు, సామాన్యులపై వరాల కురిపించడం కంటే ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికే మోదీ సర్కారు ఇప్పటివరకు ప్రాధాన్యమిస్తూ వచ్చింది. ఉపాధి పెంపు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించింది. ఈసారీ ఇదే పంథా కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details