ఆర్థిక మందగమనంతో అమెరికా సహా పలు దేశాలు అల్లాడుతున్నవేళ ఆ ప్రభావం భారత్‌పైనా పడనుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే సవాళ్లను అధిగమిస్తూ దేశీయ అవసరాలను తీర్చేలా 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర కసరత్తు చేస్తోంది. భారత్‌లోనూ ఆర్థిక వృద్ధి నెమ్మదించినట్లు పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే చర్యలతో పాటు, వివేకవంతమైన మార్గాలను బడ్జెట్‌లో అనుసరించాల్సిన అవసరం కేంద్ర ముందు ఉంది. డిమాండులో అనిశ్చితులు, ఎగుమతి మందగమనం కారణంగా ప్రైవేటు రంగ పెట్టుబడిదారులకు సవాళ్లు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి, బడ్జెట్‌లో వారికి మూలధన సాయాన్ని అందించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది.
ప్రస్తుతం ఐరోపా, చైనా, అమెరికా వంటి దేశాల్లో పారిశ్రామిక వృద్ధి రేటు క్రమంగా తగ్గుతోంది. ప్రపంచ దేశాల్లో మాంద్యం పరిస్థితులు, కరోనా విజృంభణ కుదిపేస్తుంటే భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నిలకడగా సాగుతుండటం హర్షణీయం. ఇటీవల ఇండియా వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు గతంలో ప్రకటించిన 6.7శాతం నుంచి 6.9శాతానికి పెంచింది. పూర్తిస్థాయిలో ఏడు శాతం వృద్ధిరేటుపై కేంద్రం భరోసాగా ఉంది. జాతీయ గణాంక కార్యాలయం (NSO) సైతం భారత ఆర్థిక వ్యవస్థ ఏడుశాతం వృద్ధిరేటు సాధిస్తుందని వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధిరేటు 6.8శాతం ఉంటుందని రిజర్వు బ్యాంకు అంచనా వేసింది. మరోవైపు, పన్ను రాబడి పెరగడమూ సానుకూల పరిణామం.