వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పనుంది! పన్ను స్లాబ్లకు సంబంధించి బడ్జెట్‌లో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కీలక మార్పులతో కొత్త పన్ను వ్యవస్థను కేంద్రం తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. కొత్త పన్ను విధానంలో భాగంగా.. పన్ను రేట్లను తగ్గించి కొత్త స్లాబ్‌లను అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. దీనిపై ప్రధాని కార్యాలయం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది.
వారికి గుడ్న్యూస్.. కొత్త స్లాబ్‌లతో నూతన పన్ను విధానం.. బడ్జెట్‌లో ప్రకటన? - కేంద్ర బడ్జెట్ స్లాబ్
ఆదాయపు పన్నుకు సంబంధించి కొత్త పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. నూతన పన్ను విధానంలో భాగంగా కొత్త స్లాబ్‌లు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్‌లో ఇందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న పాత పన్ను విధానానికి అదనంగా 2021లో కొత్త పన్ను వ్యవస్థను తీసుకొచ్చారు. పాత పన్ను విధానంలో కేవలం మూడు స్లాబ్‌లే ఉండేవి. కొత్త పన్ను విధానంలో అదనంగా మూడు స్లాబ్‌లు జోడించి.. మొత్తం ఆరు స్లాబ్‌లను అందుబాటులోకి తెచ్చారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం; రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10 శాతం; రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15 శాతం; రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం, రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం; రూ.15 లక్షలు ఆపైన ఆదాయం కలిగిన వారికి 30 శాతం పన్ను వర్తిస్తుంది. ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనే దానిపై పన్ను చెల్లింపుదారులకు స్వేచ్ఛ ఉంది. అయితే, కొత్త విధానంలో పన్ను మినహాయింపులను చూపించేందుకు అవకాశం లేదు.
అయితే, ఈసారి బడ్జెట్‌లో మధ్యతరగతికి పెద్దపీట వేయాలని భావిస్తున్న మోదీ సర్కారు ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయంలో ఊరటనిచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఈ మధ్యే నిర్మలా సీతారామన్ మధ్య తరగతి అంశాన్ని ప్రస్తావించడం దీనికి బలం చేకూరింది. దీంతో కొత్త పన్ను విధానంలో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.15 లక్షలు, ఆపై ఉన్న మొత్తానికి 30 శాతం పన్ను వర్తిస్తోంది. ఈ మొత్తాన్నీ పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.