బంగారం, వెండి ధరలపై కస్టమ్ సుంకాన్ని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో బంగారం, వెండి ధరలు మరింత పెరగనున్నాయి. బంగారు కడ్డీలతో తయారు చేసే ఆభరణాలపై కూడా కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు సీతారామన్ తెలిపారు. దిగుమతి చేసుకునే బంగారం ధరలు మాత్రం తగ్గనున్నట్లు ఆమె వెల్లడించారు.
దేశీయ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ల్యాబ్‌లో వజ్రాలు తయారు చేసేందుకు ఉపయోగించే సీడ్స్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు నిర్మలా ప్రకటించారు. సహజ వజ్రాలను కత్తిరించడం, పాలిష్ చేయడంలో భారత్ ప్రపంచ అగ్రగామిగా ఉందని నిర్మలా తెలిపారు. సహజ వజ్రాల నిక్షేపాలు క్షీణించడంతో పరిశ్రమ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎల్జీడీ వైపు పయనిస్తోందని దీన్ని మరింత ప్రోత్సహించేందుకు కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఇవే.. మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించిన విడి భాగాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడం వల్ల మొబైల్ ఫోన్ల ధరలు కూడా దిగిరానున్నాయి. 2014-15లో దేశంలో మొబైల్ ఫోన్ ఉత్పత్తి 5.8 కోట్ల యూనిట్ల నుంచి గత ఆర్థిక ఏడాదిలో 31 కోట్ల యూనిట్లకు పెరిగిందని ఆర్థికమంత్రి తెలిపారు. భారత్ ప్రపంచానికి ఎలక్ట్రానిక్స్ పవర్‌హౌస్‌గా మారుతోందని ప్రకటించారు.
టీవీ తయారీలో ముఖ్యమైన ఓపెన్ సెల్ భాగాలపై కస్టమ్స్ సుంకాన్ని 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించడం వల్ల టీవీల ధరలు తగ్గనున్నాయి. దాదాపు 5శాతం టీవీ ధరలు తగ్గనున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అంటే రూ.3,000 వరకు తగ్గవచ్చని అంచనావేశాయి. సైకిళ్లు, బొమ్మలు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే రబ్బరుపై సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించడం వల్ల వాటి ధరలు పెరగనున్నాయి. కిచెన్ ఎలక్ట్రిక్ చిమ్నీపై సుంకాన్ని 7.5 శాతం నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు సీతారామన్ ప్రకటించారు. సిగరెట్లపై పన్నును 16 శాతం పెంచుతున్నట్లు సీతారామన్ తెలిపారు.
వాహనాల టైర్ల ధరలు పెరగనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో వాటి ధరలు తగ్గనున్నాయి. లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీని 21 శాతం నుంచి 13 శాతానికి తగ్గించారు. బ్రాండెడ్ దుస్తులు, హీట్ కాయిల్ ధరలు పెరుగుతాయి. ఎగుమతులను ప్రోత్సహించేందుకు రొయ్యల ఫీడ్‌పై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన నిర్మల.. కెమెరా లెన్స్, కెమెరా విడి పరికరాలు, ఫోన్‌లో కెమెరా పరికరాలపై 2.5 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కెమెరాల ధరలు పెరగనున్నాయి.