కేంద్రం ప్రవేశపెట్టనున్న నూతన బడ్జెట్‌లో కీలకమైన విద్యారంగంపై ఆసక్తి నెలకొంది. నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన మోదీ సర్కార్... అందులో విధివిధానాల మేరకు కేటాయింపులు గణనీయంగా పెంచే అవకాశాలు ఉన్నాయి. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలను నిపుణులైన బోధనా సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కింద కొన్ని నూతన విధానాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఐదేళ్ల పరిమితకాలానికి విదేశీ విద్యా నిపుణులను భారత్‌కు రప్పించి దేశంలో బోధనా సిబ్బందికి శిక్షణ ఇప్పించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇందుకోసం ఫారిన్ ఫ్యాకల్టీ హైరింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ నిధితోనే విదేశీ బోధనా నిపుణులకు జీతాలు, వసతి, ప్రయాణ ఖర్చును భరించేలా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అలా దేశానికి తొలుత వచ్చే విదేశీ విద్యా నిపుణులకు పన్ను రాయితీలను కూడా కల్పించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.
వీఆర్, ఏఆర్‌ల ఉపయోగంపై శిక్షణ
యువత సంఖ్య పరంగా ప్రపంచానికి అత్యంత వేగంగా ప్రతిభావంతులను అందించే కేంద్రంగా భారత్ మారుతోంది. 2047 నాటికి ప్రపంచ శ్రామికశక్తిలో 25శాతం భారత్ నుంచే ఉండాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా భారతీయ విద్యార్థులను తీర్చిదిద్దాలని భావిస్తోంది. అయితే.. విద్యకు, ఉపాధికి మధ్య దేశంలో అంతరం బాగా ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యా సంస్థల్లో అందడంలేదంటున్నారు. ఈ అంతరాన్ని బాగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పరమైన మద్దతు ఇవ్వాలని సూచిస్తున్నారు. దేశంలో బోధనా సిబ్బందికి వర్చువల్ రియాలిటీ(వీఆర్), ఆగ్‌మెంటెడ్ రియాల్టీ(ఏఆర్) ఉపయోగించేలా తగిన శిక్షణ ఇప్పిస్తే ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. తద్వారా తరగతి గదుల్లో సాంకేతిక వినియోగం పెరుగుతుందని చెబుతున్నారు. ఇందుకు కేంద్రం బడ్జెట్‌లో చొరవ చూపాలని కోరుతున్నారు.