పెట్టుబడి, బీమా, పన్ను మినహాయింపు ఇలా పలు ప్రయోజనాలను కల్పించే యులిప్‌లు ఇప్పుడు కొత్త ప్రయోజనాలనూ జోడిస్తున్నాయి. ఎలాంటి ఫండ్లలో మదుపు చేయాలని నిర్ణయించుకునే స్వేచ్ఛా పాలసీదారుడికి కల్పిస్తున్నాయి. దీనికోసం బీమా సంస్థలు ఉచిత స్విచ్ఛింగ్‌నూ అందిస్తున్నాయి. సరైన పెట్టుబడి వ్యూహం అనుసరిస్తే.. పాలసీ కొనసాగుతున్న వ్యవధిలో సంపదను పెంచుకునేందుకూ వీటి ద్వారా వీలవుతుంది. పాలసీ ముగిసిన తర్వాత వచ్చే ప్రయోజనాలను ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. లేదా నిర్ణీత కాలంపాటు ఆదాయంగా అందుకోవచ్చు.
క్రమశిక్షణతో..
యులిప్‌లను ఎంచుకున్నప్పుడు క్రమంగా దీనికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. నెలనెలా, మూడు, ఆరు నెలలకోసారి లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లించే వీలుంటుంది. మీ ఆదాయం, ఇతర ఖర్చులను బట్టి, ప్రీమియం చెల్లింపు వ్యవధిని నిర్ణయించుకోవచ్చు. ఆర్థిక క్రమశిక్షణతో ప్రీమియం చెల్లిస్తూ.. సంపదను పెంచుకునేందుకు వీలు కల్పిస్తుంది.
సగటు ప్రయోజనం..
ఒకేసారి పెట్టుబడి పెట్టినప్పుడు మార్కెట్ సూచీలు తక్కువ, ఎక్కువ అనే లెక్క ఉండదు. దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు రావచ్చు. దీనికి భిన్నంగా క్రమంగా పెట్టుబడులు పెట్టినప్పుడు మార్కెట్ అన్ని దశల్లోనూ పాలు పంచుకునే అవకాశం లభిస్తుంది. ఫలితంగా రూపాయి సగటు ప్రయోజనాన్ని పొందేందుకు యులిప్‌లు వీలు కల్పిస్తాయి. మీ పెట్టుబడి వ్యయం తగ్గి, నికర రాబడి పెరిగేందుకు వీలవుతుంది.
వృద్ధికి అవకాశం..
యులిప్ తీసుకున్నప్పుడు పాలసీ, చెల్లింపు వ్యవధుల ఆధారంగా ప్రీమియాన్ని చెల్లిస్తూ ఉంటాం. పాలసీ గడువు తీరిన తర్వాత ఒకేసారి వెనక్కి తీసుకోకుండా.. అవసరం మేరకే ఉపసంహరించుకునే వీలూ ఉంటుంది. కాబట్టి, పెట్టుబడిని మార్కెట్లో కొనసాగిస్తూనే ఉండొచ్చు. దీనివల్ల మీ పెట్టుబడి వృద్ధికి అవకాశం ఉంటుంది. కాబట్టి, మరింత రాబడిని అందుకోవచ్చు.