తెలంగాణ

telangana

ETV Bharat / business

'దేశవ్యాప్తంగా 200 కొత్త శాఖలు.. రూ.1500 కోట్ల లాభం టార్గెట్'

యూకో బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1500 కోట్ల నికరలాభాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆ బ్యాంకు ఎండీ, సీఈఓ సోమ శంకర ప్రసాద్‌ తెలిపారు. బ్యాంకు మొండి బకాయిలు తగ్గుతున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా 200 కొత్త శాఖలు నెలకొల్పనున్నట్లు చెప్పారు.

UCO Bank CEO interview
UCO Bank CEO interview

By

Published : Dec 15, 2022, 7:13 AM IST

యూకో బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1500 కోట్ల నికరలాభాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్‌-సెప్టెంబరులోనే రూ.930 కోట్ల నికరలాభం నమోదైనందున, పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమిస్తామని యూకో బ్యాంకు ఎండీ, సీఈఓ ఎం. సోమ శంకర ప్రసాద్‌ ఇక్కడ వెల్లడించారు. 'సెప్టెంబరు త్రైమాసికంలో రూ.505 కోట్ల నికరలాభాన్ని ఆర్జించాం. బ్యాంకు ఏర్పాటయ్యాక, ఒక త్రైమాసికంలో రూ.500 కోట్లకు మించిన లాభాన్ని నమోదు చేయడం ఇది రెండోసారే' అన్నారాయన. మొండి బాకీల భారం గణనీయంగా తగ్గినట్లు, ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో (పీసీఆర్‌) 93 శాతం ఉన్నట్లు చెప్పారు. సమీప భవిష్యత్తులో కొత్తగా కేటాయింపులు చేయాల్సిన అవసరం అంతగా ఉండదని అన్నారు. మూలధన నిష్పత్తి 15 శాతంగా ఉండగా, స్థూల నిరర్థక ఆస్తులు 6.5 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 1.99 శాతానికి తగ్గినట్లు తెలిపారు. ఆయన వెల్లడించిన ముఖ్యాంశాలివీ..

రుణాలకు అధిక గిరాకీ:
ఇటీవల అన్ని విభాగాల్లో రుణాలకు గిరాకీ పెరిగింది. ఏప్రిల్‌-సెప్టెంబరులో రుణాల్లో 17%, డిపాజిట్లలో 10% వృద్ధి నమోదైంది. ద్వితీయార్ధంలోనూ రుణాల్లో 15%, డిపాజిట్లలో 10 శాతానికి మించిన వృద్ధి ఆశిస్తున్నాం. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, స్టీలు, సిమెంటు, ప్రత్యామ్నాయ ఇంధన ప్రాజెక్టుల కోసం కార్పొరేట్‌ సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు అధికంగా రుణాలు తీసుకుంటున్నాయి.

రూ.1,000 కోట్లు సమీకరిస్తాం:
ఇప్పటికిప్పుడు మాకు అదనపు నిధులు అవసరం లేదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూ.1,000 కోట్ల నిధులను టైర్‌-1 రూపంలో కానీ, ఈక్విటీ షేర్లు జారీ చేయడం ద్వారా కానీ సమకూర్చుకుంటాం.

వడ్డీ రేట్లలో పెరుగుదల స్వల్పమే:
రెపో రేటు ఈ ఆర్థికంలోనే 4% నుంచి 6.25 శాతానికి చేరింది. ఇందువల్ల వడ్డీ రేట్లు ఇప్పటికే బాగా పెరిగాయి. రెపోరేటు మరో 0.25% పెరగొచ్చు. అందువల్ల వడ్డీరేట్లు ప్రస్తుత స్థాయి నుంచి ఎక్కువగా పెరగకపోవచ్చు. రిటైల్‌ ద్రవ్యోల్బణం 6% దిగువకు రాగా, అమెరికాలోనూ తగ్గుతోంది. అందువల్ల అక్కడా వడ్డీరేట్లు అధికంగా పెరిగే అవకాశం ఉండదు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.9,500 కోట్ల వ్యాపారం
యూకో బ్యాంకుకు దేశవ్యాప్తంగా 3,100 శాఖలుంటే, అందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 81 శాఖలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.9,500 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేస్తున్నాం. దేశంలో కొత్తగా 200 శాఖలు ప్రారంభించనున్నాం. వీటిల్లో తెలుగు రాష్ట్రాల్లో 5 ఉంటాయి. సీడీ రేషియో నూరు శాతం కంటే ఎక్కువగా ఉంది. దేశంలో నష్టాల్లో ఉన్న కొన్ని శాఖలను మూసివేసే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details