Uber Cyber Attack : ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్‌కు కూడా హ్యాకింగ్ బెడద తప్పలేదు. ఒక హ్యాకర్.. తమ కీలక నెట్వర్క్ యాక్సెస్ పొందినట్లు తెలిసిందని కంపెనీ పేర్కొంది. దీంతో అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భద్రతా సంస్థలను కోరినట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి.. ఉబర్ కార్యకలాపాలు ప్రభావితమైనట్లు ఎటువంటి సంకేతాలూ కనిపించలేదని స్పష్టం చేసింది.
హ్యాకర్ చాలా వివరాలే పొందాడని యుగా ల్యాబ్స్‌కు చెందిన సెక్యూరిటీ ఇంజినీర్ సామ్ కర్రీ తెలిపారు. ఆ హ్యాకర్‌తో నేరుగా సంభాషించిన సామ్ ఈ విషయం చెప్పారు. ఉబర్ సోర్స్ కోడ్, వినియోగదారుల సమాచారం భద్రపరిచే.. కీలక అమెజాన్, గూగుల్ క్లౌడ్ల నుంచి అతడు కీలక వివరాలు సేకరించాడని వివరించారు. హ్యాకర్ యాక్సెస్‌ను నియంత్రించే విధంగా తాను చాలా మంది ఉబర్ ఉద్యోగులతో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. అంతర్గతంగా అతడికి ఎలాంటి సమాచారం అందకుండా ఉండేందుకు పనిచేస్తున్నట్లు వివరించారు సామ్.
''హ్యాకర్ ఉబర్ సేవలకు ఏదైనా అంతరాయం కలిగించినట్లు కనిపించలేదు. పబ్లిసిటీకి మించి అతడికి మరేదైనా ఆసక్తి ఉన్నట్లు కనిపించలేదు. చాలా మంది దృష్టిని ఆకర్షించడానికే హ్యాకర్లు ఈ పనిచేసినట్లు నా బలమైన నమ్మకం.''
- సామ్ కర్రీ, రీసెర్చ్ ఇంజినీర్