సోషల్ మీడియా సంస్థ ట్విటర్.. బ్లూటిక్కు సంబంధించి మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 10వేల కంపెనీలకు ఉచితంగానే బ్లూటిక్ రైట్స్‌ను ఇవ్వనున్నట్లు ప్రకిటించింది. అలాగే ట్విట్టర్లో భారీగా ఫీజు చెల్లించి అత్యధికంగా యాడ్స్ ఇస్తున్న 500 టాప్ అడ్వర్టైజర్లకు కూడా ఈ నిర్ణయాన్ని వర్తింపచేయనున్నట్లు స్పష్టం చేసింది. ఆయా కంపెనీ ఖాతాల్లోని ఫాలోవర్స్ ఆధారంగానే టాప్ కంపెనీలతో పాటు ప్రముఖ యాడ్ కంపెనీలను గుర్తించి వాటికి మాత్రమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని సంస్థ వెల్లడించింది. ట్విట్టర్ వరుస నిర్ణయాలతో పలు కంపెనీల అడ్వర్టైజర్ల లాభాలు దెబ్బతిన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆయా సంస్థలను సంతృప్తి పరిచేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్లో వెరిఫైడ్(అధికారిక) అకౌంట్‌గా పరిగణించే బ్లూటిక్‌ను పొందాలంటే ప్రస్తుతం 1000 డాలర్ల(భారత కరెన్సీలో రూ.82,000) రుసుము చెల్లించాల్సి ఉంది. ఈ బ్లూటిక్ ఉంటేనే ఆయా ఖాతాలను అధికారికమైన అకౌంట్లుగా భావిస్తారు. నెలవారీ లేదా వార్షిక రుసుమును చెల్లించిన తర్వాతే ఈ బ్లూటిక్ హక్కులను ఆయా సంస్థలకు ఇస్తుంది ట్విట్టర్.
కాగా, బ్లూటిక్ వెరిఫికేషన్ పాత విధానాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నుంచే నిలిపివేయనున్నట్లు ఇదివరకే సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీని స్థానంలో నిర్ణీత ఫీజు చెల్లించిన వారికే మాత్రమే బ్లూటిక్ రైట్స్‌ను ఇస్తామని ట్విట్టర్ ప్రకటించిన నేపథ్యంలో సంస్థ తాజా నిర్ణయం తీసుకుంది. వెరిఫికేషన్ ఫర్ ఆర్గనైజేషన్స్‌గా పిలుస్తున్న ఈ కొత్త ప్రోగ్రామ్‌లో కంపెనీలు తమ వెరిఫైడ్ అకౌంట్ కోసం నెలకు వెయ్యి డాలర్లు చెల్లిస్తుండగా.. వాటి అనుబంధ కంపెనీల ఖాతాల కోసం అదనంగా 50 డాలర్లు(రూ.4,100)రుసుమును కట్టాలనే నిబంధన ఉంది.