Twitter New CEO Linda : ట్విట్టర్ కొత్త సీఈఓగా లిండా యాకరినో నియమితులయ్యారు. ఆ విషయాన్ని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ట్విట్టర్ కొత్త సీఈఓగా లిండా యాకరినోను సంతోషంగా స్వాగతిస్తున్నానని తెలిపారు. లిండా వ్యాపార కార్యకలాపాలను చూసుకుంటారని వెల్లడించారు. తాను ప్రొడక్ట్ డిజైన్, కొత్త సాంకేతికపై దృష్టి సారిస్తానని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
ఎవరీ లిండా?
ట్విట్టర్ నూతన సీఈఓగా నియమితురాలైన లిండా యాకరినో.. ప్రస్తుతం ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్ అండ్ పార్ట్‌నర్‌షిప్స్ విభాగం ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. గత 12 ఏళ్లుగా ఆమె ఇదే సంస్థలో పనిచేస్తున్నారు. లిండా యాకరినో గత నెలలో ఓ ఈవెంట్లో మస్క్‌ను ఇంటర్వ్యూ కూడా చేశారు. వాణిజ్య ప్రకటనల ప్రభావం మరింత మెరుగుపరిచే అంశాలపై ఎన్బీసీలో ఆమె పనిచేస్తున్నారు. కంపెనీ ప్రవేశపెట్టిన ప్రకటనల ఆధారిత పికాక్ స్ట్రీమింగ్ సర్వీసెస్‌లో లిండా కీలక పాత్ర వహించారు. అంతకు ముందు టర్నర్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో లిండా యాకరినో 19 ఏళ్ల పాటు పనిచేశారు. యాడ్ సేల్స్‌ను డిజిటల్ రూపంలోకి మార్చడంలో లిండా కీలక పాత్ర వహించారు. పెన్ స్టేట్ యూనివర్సిటీలో ఆమె.. లిబరల్ ఆర్ట్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ చదివారు.