మీకు గుర్తుందా? ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ మొదటి సారి కంపెనీ ఉద్యోగుల తొలగింపు చేపట్టినప్పుడు.. పనిభారంతో ఓ మేనేజర్ ఆఫీస్‌లోనే పడుకున్నారు. ఇంటికెళ్లే సమయం లేక.. స్లీపింగ్ బ్యాగ్‌లో అక్కడే సేదదీరారు. ఆఫీసులోని టేబుల్, చైర్ల వెనుక నిద్రపోయారు. అప్పట్లో ఆ ఫొటో.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. ఆమెనే ట్విట్టర్లో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేసిన ఎస్తేర్ క్రాఫోర్డ్. ఇప్పుడు ఆమె స్టోరీ ఎందుకనుకుంటున్నారా? ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్.. ఆమెను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక నుంచి ఆఫీస్‌కు రావలసిన అవసరం లేదంటూ శనివారం ఈమెయిల్ చేశారు. కంపెనీ కోసం అహర్నిశలు శ్రమించిన ఆమెను.. కనికరం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారు.
ఇంటికి వెళ్లకుండా ఆఫీస్‌లోనే ఉండి పనిచేసిన మేనేజర్.. అయినా లేఆఫ్తో మస్క్ షాక్ - ఎలన్ మస్క్
మస్క్ మరోసారి ట్విట్టర్ ఉద్యోగులను తొలగించారు. ఈసారి జరిపిన తొలగింపుల్లో.. కంపెనీకి కీలకంగా వ్యవహరిస్తున్న మేనేజర్లపై వేటుపడింది. వివిధ విభాగాల్లో ఉద్యోగుల తొలగిస్తున్నట్లు శనివారం ఈ మెయిళ్లు పంపారు మస్క్.
ఎస్తేర్ క్రాఫోర్డ్.. కంపెనీకి చెందిన వివిధ ప్రాజెక్టుల్లో కీలకంగా వ్యవహరించారు. పలు ప్రాజెక్టులకు నాయకత్వం వహించి ముందుండి నడిపించారు. బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ వెరిఫికేషన్, కొద్ది రోజుల్లో రాబోయే పేమెంట్ ప్లాట్‌ఫామ్ ప్రాజెక్ట్‌కు సైతం ఎస్తేర్ క్రాఫోర్డ్ నాయకత్వం వహించేవారు. తాజాగా మస్క్ తీసుకున్న నిర్ణయంతో ఆమెతో పాటు మరో 50 మంది ఉద్యోగులపై వేటు పడింది. కంపెనీలోని పలు విభాగాల్లో ఈ తొలగింపులు జరిగాయి. రివ్యూ న్యూస్ లేటర్ ఫ్లాట్‌ఫామ్(ఇప్పుడు అందుబాటులో లేదు) సృష్టికర్త.. మార్టిన్ డి కైపర్పై కూడా వేటుపడింది. వీరందరికీ ఈ మెయిల్ ద్వారానే తొలగింపు సమాచారం అందింది.
ట్విట్టర్లో ఉద్యోగులను తొలగించటం ఇది నాలుగో సారి. కొద్దిరోజుల క్రితమే కంపెనీలో ఇక భారీగా తొలగింపులు ఉండవని మస్క్ ప్రకటించారు. అయినా మరోసారి ఉద్యోగులను తొలగించటం గమనార్హం. మొత్తం 7,500 మంది ఉద్యోగుల్లో.. ఇప్పటి వరకు మూడొంతుల మందిని మస్క్ తొలగించారు. ఈ దశలో యాడ్స్, ఇన్ఫ్రాస్టక్చర్ ఇంజనీరింగ్ విభాగంలో ఎక్కువగా తొలగింపులు జరిగాయి. దీంతో కంపెనీలో 2500 మంది ఉద్యోగులు మాత్రమే మిగిలారు.
44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ .. కొన్న వారం రోజుల్లోనే సంస్థలో అనేక భారీ మార్పులు తీసుకొచ్చారు. కొనుగోలు ప్రక్రియ ముగిసిన కొద్ది గంటలకే సీఈఓ పరాగ్ అగర్వాల్ సహా నలుగురు ఉన్నతోద్యోగులను తొలగించారు. ఇప్పటికీ ఈ తొలగింపుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.