తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్విట్టర్​లో 80 శాతం నకిలీ ఖాతాలే.. మస్క్​ కీలక వ్యాఖ్యలు - ట్విట్టర్ స్పామ్ అకౌంట్స్

Twitter Fake Accounts: ట్విట్టర్​పై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి విరుచుకుపడ్డారు. 80 శాతం ట్విట్టర్​ ఖాతాలు నకిలీవేనన్న ఆరోపణల నేపథ్యంలో తనదైన శైలిలో స్పందించారు. ట్విట్టర్ గతంలో చెప్పినట్లు నకిలీ ఖాతాలు 5శాతం కాదని.. అంతకంటే ఎక్కువేనని అన్నారు.

ట్విట్టర్ నకిలీ ఖాతాలు
twitter fake accounts

By

Published : Sep 1, 2022, 6:00 PM IST

Twitter Fake Accounts: పది ట్విట్టర్​ అకౌంట్​లలో ఎనిమిది నకిలీవే అన్న టాప్ మోస్ట్ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు డాన్ వుడ్స్ వాదనను ఉటంకిస్తూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ట్విట్టర్​పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్​ గతంలో చెప్పినట్లు నకిలీ ఖాతాల సంఖ్య 5శాతం కాదని కచ్చితంగా అంతకంటే ఎక్కువేనని ఎద్దేవా చేశారు మస్క్​.

యూఎస్ ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్‌లతో 20 సంవత్సరాలకు పైగా పనిచేసిన సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ ఎఫ్-5 గ్లోబల్ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డాన్ వుడ్స్ 80 శాతానికి పైగా ట్విట్టర్ ఖాతాలు నకిలీవి కావచ్చని ది ఆస్ట్రేలియన్‌ పత్రికతో అన్నారు. అలాగే ట్విట్టర్ యజమాన్యం, ఎలాన్ మస్క్ ఇద్దరూ ఈ సమస్యను తక్కువ అంచనా వేసినట్లు చెప్పారు.

ట్విట్టర్​ను 44 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.3.50 లక్షల కోట్లు) కొనుగోలు చేసేందుకు ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని జులైలో రద్దు చేసుకున్నారు మస్క్​. నకిలీ ఖాతాల సంఖ్యకు సంబంధించి తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది. ఎలాన్‌ మస్క్‌ షరతులకు లోబడి ఒప్పందాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డెలావర్‌లోని ఓ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఒప్పందంలో అంగీకరించినట్లుగా ఒక్కో షేరును 54.20 డాలర్ల వద్ద కొనుగోలు చేసేలా ఆదేశించాలని కోరింది.
ఈ పిటిషన్‌ను స్వీకరించిన డెలావర్‌ కోర్టు.. అక్టోబరు 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు దీనిపై విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. దీంతో మస్క్‌.. సామాజిక మాధ్యమంపై కౌంటర్‌ దావా వేశారు. అయితే ఈ దావాపై ట్విట్టర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఇవీ చదవండి:సీరం నుంచి మరో కీలక వ్యాక్సిన్.. అతి తక్కువ ఖర్చుతో ప్రాణాంతక వ్యాధికి చెక్!

మళ్లీ రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. రూ.1.43 లక్షల కోట్లు రాబడి

ABOUT THE AUTHOR

...view details