Twitter Elon Musk : ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకోవడంపై దృష్టి పెట్టారు ఎలాన్ మస్క్. ఇందులో భాగంగానే సగం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించి.. బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌కు డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ఓ వైపు వాణిజ్య ప్రకటనల ఆదాయం తగ్గింది. దీంతో ఆదాయం పెంచుకోవడానికి మస్క్ పాత ట్విట్టర్ యూజర్‌నేమ్‌లపై కన్నేశారు.
ఎలాన్ మస్క్ కొత్త ప్లాన్.. ట్విట్టర్ పాత ఖాతాలపై కన్ను! ఆదాయం కోసమే.. - ఎలాన్ మస్క్ లేటెస్ట్ న్యూస్
ఆదాయం పెంచుకునేందుకు ఎలాన్ మస్క్ మరో కొత్తగడకు తెరతీశారు. ఏళ్లుగా వినియోగంలో లేని ఖాతాల యూజర్‌నేమ్‌లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని ట్విట్టర్ భావిస్తోంది.
ఏళ్లుగా ఎలాంటి ట్వీట్లూ చేయకుండా లాగిన్ అవ్వకుండా ఉన్న యూజర్ నేమ్‌లను విక్రయించాలని ట్విట్టర్ ఆలోచిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఇలాంటి ఖాతాలను ట్విట్టర్ ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచాలని భావిస్తోంది. తమకు కావాల్సిన యూజర్‌నేమ్‌ను వేలంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో యూజర్ నేమ్‌కి కనీసం ధర ఎంత పెట్టేదీ స్పష్టత లేదు. దీనికి ఎప్పటి నుంచో మస్క్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 150 కోట్ల ఖాతాల పేర్లను ఖాళీ చేయనున్నట్లు డిసెంబర్‌లోనే మస్క్ ప్రకటించారు. తొలగింపునకు సంబంధించిన సమాచారం ఆయా ఖాతాదారులకు వెళుతుందని, ఖాతాను కొనసాగించాలనుకుంటే అప్పీల్ చేసుకునే వెసులుబాటూ ఉంటుందని చెప్పారు.
ట్విట్టర్‌లో పేరు తర్వాత @ సింబల్‌తో మొదలయ్యేదాన్ని యూజర్‌నేమ్ అంటారు. ఎవర్నైనా ట్యాగ్ చేయాలంటే యూజర్ నేమే కీలకం. ఉదాహరణకు ఎలాన్ మస్క్ ఖాతానే తీసుకుంటే @elonmusk అని ఉంటుంది. చాలా మంది ప్రముఖుల ఖాతాలకు పేరు సహా యూజర్ నేమ్ కూడా దాదాపు అదే ఉంటుంది. కానీ, కొంతమంది సెలబ్రిటీల ఖాతాల విషయంలో పైకి కనిపించే పేరు అదే ఉన్నా.. యూజర్ నేమ్ వేరే ఉంటుంది. వేలానికి ఉంచిన వాటిలో తమ పేరుపై యూజర్‌నేమ్ ఉంటే వాటిని వేలంలో కొనుగోలు చేసుకోవచ్చు.