సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB) సంక్షోభంపై ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ తనదైన శైలిలో స్పందించారు. సంక్షోభంలో ఉన్న SVBను కొనుగోలు చేసేందుకు తాను సిద్ధమని మస్క్ ప్రకటించారు. SVBని డిజిటల్ బ్యాంక్‌గా మారుస్తానంటూ ట్వీట్ చేశారు. SVBని ట్విట్టర్ కొనుగోలు చేసి డిజిటల్ బ్యాంక్‌గా మార్చాలని ఎలక్ర్టానిక్ కంపెనీ రెజర్ సీఈవో మిన్ లియోంగ్ టన్ చేసిన ట్వీట్‌కు బదులిస్తూ.. దానికి తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంకును మూసివేస్తున్నట్లు.. ఫెడరల్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఎఫ్‌డీఐసీ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్.. అమెరికాలోని 16వ అతిపెద్ద బ్యాంక్. ప్రపంచ వ్యాప్తంగా టెక్ స్టార్టప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆర్థిక సంక్షోభం కారణంగా దీన్ని శుక్రవారం మూసివేసారు. ఈ బ్యాంకు ఆకస్మిక మూసివేత అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2022 నాటికి 209 బిలియన్ డాలర్ల ఆస్తులు, 175.4 బిలియన్ డాలర్ల డిపాజిట్లు కలిగి ఉంది.. సిలికాల్ వ్యాలీ బ్యాంక్. ప్రస్తుతం ఈ బ్యాంకు మూసివేత.. ఆస్తుల జప్తు వార్తల నేపథ్యంలో పెట్టుబడిదారులు, డిపాజిటర్లు తమ వాటాలను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం బ్యాంకులో తక్కువ మొత్తంలో నగదు అందుబాటులో ఉందని.. రెండు రోజుల వరకు ఎవరూ డబ్బును ఉపసంరించుకోవద్దని SVB సూచించింది. నగదు విషయంలో ఎలాంటి భయాలు వద్దని ఎస్వీబీ బ్యాంక్ తమ వినియోగదారులకు లేఖ రాసినా సరే డిపాజిట్ల ఉపసంహరణ మాత్రం ఆగడం లేదు. గురువారం ఒక్కరోజే పెట్టుబడుదారులు, డిపాజిటర్లు కలిసి దాదాపు 42 బిలియన్ డాలర్ల ఉపసంహరణకు ప్రయత్నించినట్లు ఎఫ్‌డీఐసీ వెల్లడించింది.