ట్విట్టర్లో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్’ను ప్రీమియం సర్వీసుగా మార్చి తీసుకొచ్చారు కొత్త యజమాని ఎలాన్ మస్క్. ఈ బ్లూ టిక్‌కు నెలవారీ ఛార్జీలు ప్రకటించారు. అయితే దీనివల్ల నకిలీ ఖాతాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో ఈ సర్వీసును నిలిపివేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్విటర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కన్పించట్లేదని కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేయకముందు.. ప్రభుత్వ విభాగాలు, కార్పొరేట్ సంస్థలు, ప్రముఖులు, జర్నలిస్టలు ఇలా ప్రముఖుల ఖాతాలను వెరిఫై చేసి ఈ ‘బ్లూ టిక్’ కేటాయించేవారు. దీంతో ఆయా ఖాతాలు వారివే అనేందుకు కచ్చితమైన ఆధారం ఉండేది. రెండు వారాల క్రితం ఈ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను మస్క్ కొనుగోలు చేసిన తర్వాత.. ఈ ‘బ్లూ టిక్’ సర్వీసులో మార్పులు చేశారు. నెలవారీ ఛార్జీలతో ప్రీమియం వెర్షన్‌ను తీసుకొచ్చారు. అంటే.. నెలకు 8 డాలర్లు చెల్లించినవారికి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే ‘బ్లూ టిక్’ ఇచ్చారు.
నిన్నటి నుంచి భారత్‌లోనూ ఈ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. అయితే, దీని తర్వాత నకిలీ ఖాతాలు విపరీతంగా పెరిగాయి. ప్రముఖ బ్రాండ్లు, కంపెనీలు, వ్యక్తుల పేరుతో నకిలీ ఖాతాలను తెరిచి వాటికి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. వాటికి కూడా బ్లూ టిక్ ఉండటంతో.. ఆ సంస్థలు/వ్యక్తుల అసలైన ఖాతా ఏదనే గందరగోళం నెలకొంది. దీనిపై ఆందోనలు వ్యక్తమవడంతో ఈ సర్వీసును ట్విట్టర్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్విట్టర్ యాప్‌లో బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ కన్పించట్లేదని పలువురు యూజర్లు పేర్కొన్నారు. అంటే.. ఇక కొత్తగా ఎవరి ఖాతాలకు ‘బ్లూ టిక్’ ఇవ్వబోరన్నమాట.
మరోవైపు ఇదే సమయంలో ట్విట్టర్ కొత్తగా ‘అధికారిక’ అనే ట్యాగ్ తీసుకొచ్చింది. వెరిఫైడ్ ఖాతాల కింద ఊదా రంగులో ‘Official’ అనే ట్యాగ్‌ను జత చేసింది. నిజానికి ఈ ట్యాగ్‌ను ఈ వారం మొదట్లోనే తీసుకురాగా.. ఆ తర్వాత దీనిపై కూడా ఆందోళనలు వ్యక్తమవడంతో కొద్ది గంటల్లోనే వెనక్కి తీసుకుంది. మళ్లీ శుక్రవారం నుంచి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే అది కూడా పూర్తి స్థాయిలో కాదు. అమెజాన్, నైక్, కోకా-కోలా, గూగుల్ వంటి కొన్ని దిగ్గజ సంస్థల ఖాతాలకు మాత్రమే ఈ ట్యాగ్ కన్పిస్తోంది. సెలెబ్రిటీలు, ప్రభుత్వ ఖాతాలకు ఇంకా దీన్ని జత చేయలేదు. రానున్న రోజుల్లో జత చేస్తారా? లేదా? అన్నదానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ.. అధికారిక ట్యాగ్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తే.. ఇక ట్విట్టర్లో ‘బ్లూ టిక్’ అనేది కన్పించకపోవచ్చేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచి ట్విట్టర్.. యూజర్లకు గందరగోళం సృష్టిస్తోంది.