ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోతపెడుతున్నాయి. గూగుల్, మెటా వంటి దిగ్గజ సంస్థలతోపాటు పలు అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఇలా రోజుకో కంపెనీ లేఆఫ్‌లను ప్రకటిస్తుండటంతో.. సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఆశావహుల్లో ఆందోళన మొదలయ్యింది. ఇటువంటి తరుణంలో భారత్‌కు చెందిన ఓ ఐటీ కంపెనీ మాత్రం.. తమ ఉద్యోగుల్లో కొంతమందికి ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచింది.
దిగ్గజ సంస్థలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తుంటే.. గుజరాత్‌కు చెందిన ఓ ఐటీ సంస్థ మాత్రం ఉద్యోగుల్లో కొంత మందికి ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చింది. తమ సంస్థ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కంపెనీకి వచ్చిన లాభాలను ఇలా ఉద్యోగులతో పంచుకున్నట్లు తెలిపింది.
అహ్మదాబాద్‌కు చెందిన త్రిథ్యా టెక్ సంస్థ.. ఇటీవలే ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ 13 మంది ఉద్యోగులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల కృషి వల్లే కంపెనీ ఈ స్థాయికి చేరుకుందని పేర్కొన్న సంస్థ ఎండీ.. అందుకు గుర్తింపుగా వీటిని అందజేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చిన లాభాలను ఉద్యోగులతో పంచుకోవడమే మంచిదని భావించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లోనూ తమ ఉద్యోగులకు ఇటువంటి ఆఫర్లు ఉంటాయన్నారు. పూర్తిగా భాగస్వామ్యం కావడంతోపాటు కష్టపడి పనిచేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని చెప్పారు.
100 మందికి మారుతీ కార్లు..
గతేడాది కూడా చెన్నైకి చెందిన ఓ ఐటీ కంపెనీ తమ ఉద్యోగులకు ఇటువంటి ఆఫర్ ఇచ్చింది. ఐడియాస్2ఐటీ అనే సంస్థ 100 మంది ఉద్యోగులకు మారుతీ కార్లను అందించింది. తమ సంస్థలో 500 మంది ఉద్యోగులు ఉన్నారని.. అందులో 10 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వారి సేవలకు గుర్తింపుగా ఈ బహుమతులు అందిస్తున్నట్లు అప్పట్లో పేర్కొంది. ఈ వార్త పూర్తి వివరాల కోసం లింక్‌పై క్లిక్ చేయండి.