Train Ticket Transfer Process : మనం చాలా సార్లు అత్యవసర పనుల కోసం.. ముందుగానే రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటాం. కానీ అనుకోని పరిస్థితులు వల్ల సదరు పనులు వాయిదా పడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మన టికెట్ వృథా అయిపోతుంది. అయితే రైలు ప్రయాణానికి ముందే మనం సమాచారం ఇస్తే.. టికెట్ ధరలో కొంత మినహాయించుకుని, మిగతా సొమ్మును మనకు అందించడం జరుగుతుంది. అయినప్పటికీ మనకు కొంత మేరకు మనీలాస్ అయినట్లే లెక్క. దీనిని నివారించడానికే.. భారతీయ రైల్వే సరికొత్త మార్పులు తీసుకువచ్చింది. కన్ఫార్మ్ అయిన టికెట్‌ను మరో ప్రయాణికుడికి బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
వారికి మాత్రమే ఛాన్స్!
కన్ఫార్మ్ అయిన టికెట్‌ను ఎవరికిపడితే వారికి బదిలీ చేయడానికి వీలుపడదు. కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే కన్ఫార్మ్డ్ టికెట్‌ను ట్రాన్స్ఫర్ చేయడానికి వీలవుతుంది. అంటే అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, భార్య, కొడుకు, కూతరులకు మాత్రమే టికెట్ బదిలీ చేయడానికి అవకాశం ఉంటుంది.
- గ్రూప్ టికెట్లకు కూడా ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఉంటుంది. అయితే దీనికి 48 గంటలకు ముందే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
- ఎడ్యుకేషన్ ట్రిప్ విషయంలో మాత్రం ఒక ప్రత్యేకమైన సౌకర్యం ఉంది. అది ఏమిటంటే.. ఒక విద్యార్థి మరో విద్యార్థికి ట్రైన్ టికెట్‌ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే ఆ ఇద్దరు విద్యార్థులు కూడా.. ఒకే ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉండాలి.
- ప్రభుత్వ ఉద్యోగులు.. ఆఫీషియల్ డ్యూటీపై వెళ్లాల్సి వచ్చినప్పుడు.. తమ సహోద్యోగి పేరుపై రైలు టికెట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
24 గంటల ముందుగానే..
సాధారణంగా మనం రైలు ప్రయాణానికి కొంత సమయం ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తూ ఉంటాం. కానీ కన్ఫార్మ్డ్ టికెట్‌ను బదిలీ చేయాలంటే 24 గంటల ముందు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా IRCTCపోర్టల్‌లో టికెట్ ట్రాన్స్ఫర్ చేసేందుకు రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే రైలు టికెట్ బదిలీ చేయడానికి వీలు అవుతుంది.
నోట్ : తత్కాల్ టికెట్లను మాత్రం ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడానికి వీలుపడదు. అలాగే ఆర్ఏసీ టికెట్లను కూడా ఇతరుల పేరుపై ట్రాన్స్ఫర్ చేయడానికి వీలుండదు.
ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమిటి?
ఒక వేళ మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే రైలు ప్రయాణానికి 48 గంటల ముందే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పండుగలు, వివాహాలు, వ్యక్తిగత పనుల కోసం ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు కూడా 48 గంటల ముందుగానే.. ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ఎన్సీసీ అభ్యర్థులు కూడా టికెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది.